మంగళగిరి రూరల్: మండల పరిధి నూతక్కి గ్రామంలో కేంద్ర బృందం శనివారం ఆధునిక సాగు విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గ్రామ రైతులు శివశంకర్ రెడ్డి, కల్లం శివరామిరెడ్డి, కొల్లి రేష్మా సాగు చేస్తున్న పొలాలను సందర్శించి డ్రిప్ ఇరిగేషన్, ఫెర్టిగేషన్, ఆటోమేషన్ విధానాల ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకుంది.శివశంకర్ రెడ్డి పొలంలో ఫెర్టిగేషన్ విధానంలో కాలీఫ్లవర్ సాగును పరిశీలించిన బృందం నీరు, ఎరువులను మొక్కలకు అవసరమైన మేరకు అందించే పద్ధతిని తెలుసుకుంది. అనంతరం కల్లం శివరామిరెడ్డి పొలంలో మొబైల్ ఫోన్ ద్వారా మోటారును ఆన్‌న్, ఆఫ్ చేస్తూ సాగునీటి వ్యవస్థను నియంత్రించే డ్రిప్ ఆటోమేషన్ విధానాన్ని పరిశీలించింది. డ్రిప్ ఇరిగేషన్‌న్‌కు 90 శాతం, ఆటోమేషన్ పరికరాలకు 55 శాతం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలను తెలుసుకుంది. పంట దిగుబడుల పెంపునకు ఉన్న అవకాశాలపై రైతులతో చర్చించింది.ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ పుల్లారెడ్డి, ఓఎస్‌డీ టెక్నికల్ ఏపీఎంఐపీ మునిరెడ్డి, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వజ్రశ్రీ, పాల్గొన్నారు.
రేపు విభిన్న ప్రతిభావంతుల క్రీడోత్సవాలు
నెహ్రూనగర్: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 30వ తేదీన జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల, హిజ్రా, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎన్.వెంకటరవణప్ప శనివారం ఒక ప్రకటన తెలిపారు. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఉదయం 10 గంటలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విభిన్న ప్రతిభావంతుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, ఆత్మవిశ్వాసాన్ని నింపడం, సమాజంలో సమాన అవకాశాలను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ సకాలంలో హాజరై, ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
విద్యుత్ బిల్లులు చెల్లింపునకు ప్రత్యేక కౌంటర్లు
కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఆదివారం సెలవు రోజూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు గుంటూరు సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ చల్లా రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిధిలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇంటి నుంచే ఏపీఎస్‌పీడీసీఎల్ కస్టమర్ యాప్, ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ఆయన సూచించారు.
భర్త మందలించడంతో ఉరి వేసుకుని భార్య మృతి
లక్ష్మీపురం: భర్త మందలించడంతో క్షణికావేశంలో ఫ్యానుకు ఉరి వేసుకుని భార్య మృతి చెందిన ఘటనపై పట్టాభిపురం పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. వివరాలు.. గుంటూరు రవీంద్రనగర్‌లోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం వద్ద శ్రవణ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న మార్పుడి నాగమణి (26) భర్త బాజీలకు 10 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరువురికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే శనివారం ఉదయం కుమార్తె స్కూల్‌కు ఆలస్యంగా నిద్ర లేచిందని తల్లి నాగమణి తిట్టింది. దీంతో భర్త బాజీ భార్యను పిల్లలపై కోపం సరికాదని మందలించి పిల్లలను తీసుకుని స్కూల్‌లో దిగబెట్టేందుకు వెళ్లాడు. దీంతో భార్య నాగమణి భర్త కోపగించుకున్నాడని క్షణికావేశంలో ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుంది. భర్త బాజీ స్కూల్‌లో పిల్లలను దిగబెట్టి ఇంటి వచ్చి చూసే సరికి భార్య ఫ్యానుకు ఉరి వేసుకుని ఉంది. భర్త బాజీ హుటా హుటిన కిందకు దింపి ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న మృతురాలి తల్లి వెంకటేశ్వరమ్మ పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా ప్రదేశంలో ఘటన జరిగిన వైనాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురికి తరలించారు.
పూడ్చిపెట్టిన శవానికి పోస్టుమార్టం
దాచేపల్లి: మండలంలోని గామాలపాడు గ్రామ సమీపంలో మట్టిలో పూడ్చిపెట్టిన శవానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. సూమారుగా 20 రోజుల కిందట గుర్తుతెలియని వ్యక్తిని ఇక్కడ పూడ్చిపెట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియటంతో సీఐ షేక్ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం సభ్యులు ఘటన స్థలాన్ని పరిశీలన చేసి పలు ఆధారాలు సేకరించారు. పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసిన తరువాత కుళ్లిపోవటంతో ఘటన స్థలంలోనే వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించింది.


