రామవరప్పాడు: సినీ పక్కీలో పల్టీ కొట్టిన కారులో ప్రయాణిస్తున్న దంపతులు క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి వద్ద అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడుకు చెందిన కంఠంనేని నాగభూషణం, పద్మావతి దంపతులు వెంకటపాలెంలోని టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో అదపుతప్పి సినీ పక్కీలో పల్టీలు కొట్టుకుంటూ డివైడర్ మధ్యకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ప్రమాదంలో వారిద్దరు క్షేమంగా బయటపడ్డారు. ఈ సమాచారం అందుకున్న ఎనికేపాడు మాజీ సర్పంచి కొనేరు పెదబాబు, సొసైటీ మాజీ చైర్మన్ గోగం బాలకోటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని నాగభూషణం దంపతులను మరో కారులో గ్రామానికి తీసుకొచ్చారు.


