శరీరం సహకరించకున్నా..
చీరాలలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు విలువ ఎంత ముఖ్యమైందో నేటి సమాజానికి కొందరు ఓటర్లు తెలియజేశారు. అలాగే వారికి సహకరించిన పోలీసులు, స్థానికులు మానవత్వం విలువ చాటి చెప్పారు. అనారోగ్యంతో పాటు పక్షవాతం వచ్చిన వృద్ధులను, నడవలేని స్థితిలో ఉన్నవారిని పోలీసులతోపాటు స్థానికులు దగ్గరుండి వీల్‌చైర్‌లో పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లి ఓట్లు వేయించి మానవత్వం చాటుకున్నారు. 11 వార్డులో రమేష్ అనే వృద్ధుడు బ్రెయిన్ స్ట్రోకుతో బాధపడుతున్నప్పటికీ వారి బంధువులు అంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకొనేలా చేశారు. అలాగే పక్షవాతంలో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని వారి బంధువులు ఐటీసీ విండీస్ క్లబ్ పోలింగ్ కేంద్రానికి ఆటోలో తీసుకురావడంతో పరిస్థితిని చూసిన అక్కడ విధుల్లో పోలీసులు స్పందించి అక్కడే ఉన్న వీల్‌చైర్‌లో ఆమెను కూర్చోబెట్టి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు సహకరించి ఓటు వేయించారు. అలానే రెండు కాళ్లు నడవలేని స్థితిలో ఉన్న ఓ దివ్యాంగుడు స్వయంగా తన మూడు చక్రాల సైకిల్‌ను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేశాడు. అలానే విఠల్‌నగర్‌లోని రెడ్డిగారి హైస్కూలు పోలింగ్ కేంద్రంలో నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని ఆమె బంధువు చేతులపై మోసుకుంటూ పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించింది.
– చీరాల రూరల్


