పోతార్లంక బీసీ ఏరియా అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో మద్యం ఖాళీ సీసాల గుట్టలు ఆందోళన వ్యక్తం చేస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు
కొల్లూరు: మద్యం అమ్మకాలు గ్రామాల్లో శ్రుతిమించడంతో బడి, గుడి అన్న తేడా లేకుండా బహిరంగ మద్యపానం పరిపాటిగా మారింది. బెల్టు దుకాణాలలో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు చేపడుతుండటంతో మందుబాబుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుండటంతో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, దేవాలయాల ప్రాంగణాల్లో మద్యం సేవిస్తుండటంతో ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుంపులు గుంపులుగా చేరి మద్యం సేవిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో మహిళలు సంచరించలేక ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని పోతార్లంక బీసీ ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రం ఆవరణ బార్‌ను తలదన్నేలా మద్యం సీసాలతో నిండిపోయి ఉండటంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఆటపాటలతో కూడిన విద్యతో నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్న మద్యం సీసాల నడుమ అంగన్‌వాడీ కేంద్రంలో విద్యను అభ్యసించాల్సి వస్తోంది. మొద్దు నిద్ర నటిస్తున్న సంబంధిత శాఖాధికారులు ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


