తుఫాన్ ప్రభావం జిల్లాపై అధికంగా ఉండే అవకాశం ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకూడదు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్
చీరాల: మురుసు తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామన్నారు. ఆదివారం చీరాలలోని మున్సిపల్ కార్యాలయం నుంచి జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం అందిన అంచనాల ప్రకారం తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడి సోమవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు – ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో చీరాల వైపు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మండలాల్లో 100 నుంచి 120 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రేపల్లె వరకు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. బాపట్లతో పాటు పరిసర ప్రాంతాలైన గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో కురిసే వర్షపు నీరు డ్రెయిన్లు, కాలువలు ద్వారా బాపట్ల జిల్లా మీదుగా సముద్రంలోకి చేరుతుందన్నారు. వర్షాలు కురిసే రెండు రోజులే కాకుండా రానున్న నాలుగైదు రోజుల పాటు జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా డ్రెయిన్లు, కాలువల బలహీన ప్రాంతాలను ఇసుక బస్తాలతో పటిష్టపరిచే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వంతెనలు, క్రాసింగ్‌ల వద్ద నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న గుర్రపుడెక్క తదితరాలను యంత్రాలతో తొలగించి నీరు పారుదల అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించి అవసరాన్ని బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి సమాచారాన్ని అధికారికంగా తెలియజేస్తామన్నారు. తుఫాన్ పరిస్థితులు, అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలు ఎప్పటికప్పుడు మీడియాకు తెలియచేస్తామన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. చీరాల ఆర్డీఓ నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ కె.డానియేల్ జోసఫ్, తహసీల్దార్ కె.గోపీకృష్ణ ఉన్నారు.


