పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం ఎన్.ఎస్.ఎల్. టెక్స్‌టైల్స్‌లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై సదస్సు
గుంటూరు మెడికల్: శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా నడక, వ్యాయామం, యోగా చేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం(గుంటూరు) పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం కోరారు. బీఆర్‌ఐసీఎస్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు (బ్రిక్స్ సస్టెయినబుల్ లైఫ్‌స్టయిల్ వీక్)లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, గుంటూరు ఆధ్వర్యంలో యడ్లపాడులోని ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్స్ లిమిటెడ్ పరిశ్రమ ప్రాంగణంలో ఆదివారం ఆరోగ్యకరమైన జీవనశైలిపై కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంతో అవసరమని తెలిపారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం, వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం వంటి చిన్న చిన్న చర్యలు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్స్ జనరల్ మేనేజర్ వి.మురళి, సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, పర్యావరణ సమన్వయకర్త తిరుపతిరెడ్డి, నారాయణ ఉద్యోగులకు ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. పరిశ్రమకు చెందిన సుమారు 300 మంది ఉద్యోగులు మిషన్ లైఫ్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు ఉద్యోగులు కలిసి మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రకృతి వనరులను సంరక్షించడం, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు.


