వీరన్నపాలెం(చినగంజాం): సామాజిక రుగ్మతలను ఎత్తి చూపించేవే నాటికలు అని వక్తలు పేర్కొన్నారు. శనివారం 9వ జాతీయ స్థాయి నాటిక పోటీలు మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో కళానికేతన్ ఆధ్వర్యంలో నాటికలను ప్రదర్శించారు. చిట్టినేని అప్పయ్య, మక్కెన రామసుబ్బయ్య, ఇంకొల్లు గురుప్రసాదరావు కళాప్రాంగణంలో నిర్వహించిన ప్రదర్శనలను గోరంట్ల రత్తయ్య, ప్రసన్నాంజలి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా, చిట్టినేని శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు నటరాజ పూజ నిర్వహించి పోటీలను ప్రారంభించారు.
మనిషిని గౌరవించని సమాజం..
ముందుగా హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటికను విభిన్న తత్త్వపు మనిషి సీ్త్ర, పురుషుడు కాని వారిని అవమానించడం, గౌరవించక పోవడం, అసహ్యించుకోవడం అనేది మానవజాతి దిగజారుడు తనానికి ఓ ప్రతీక చూపుతూ ప్రదర్శన సాగింది.
పాలకుల మొసలి కన్నీరు..
ఆ తరువాత హైదరాబాద్ కళాంజలి ప్రదర్శన అన్నదాత నాటికను అన్నం పెట్టే రైతు నోట్లో అందరూ మట్టి కొట్టే వారే. ప్రకృతి వైపరీత్యాలు వల్ల నష్టాలు, గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు రాబట్టుకోలేని స్థితిలో పాలకుల మొసలి కన్నీరు, దళారీల దోపిడి, వ్యాపారుల మోసాలు రైతు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయనే కఠా సారాంశంతో సాగింది.
చిన్నచిన్న సమస్యలకే విడాకులా !
తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారి ప్రదర్శన విడాకులు కావాలి నాటికను దాంపత్య జీవితంలో దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, అపోహలు, చిన్నచిన్న సమస్యలు తలెత్తటం సహజం. అంత మాత్రాన కలిసి బతకలేమన్న తొందరపాటుతో పంతాలకు పోయి విడాకులు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనే అంశంతో నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


