హాస్టల్‌ జీవితం వ్యక్తిత్వ వికాసానికి పునాది | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ జీవితం వ్యక్తిత్వ వికాసానికి పునాది

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

బాపట్ల: హాస్టల్‌ జీవితం వ్యక్తిత్వ వికాసానికి పునాది వంటిదని నిధి సీడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.మోహన్‌ రావు అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన 81వ సంవత్సర హాస్టల్‌ డే సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థి జీవితంలో హాస్టల్‌ అనేది కేవలం నివాస స్థలం మాత్రమే కాదని, అది క్రమశిక్షణ, సమయపాలన, పరస్పర సహకారం, నాయకత్వ లక్షణాలను నేర్పించే జీవిత పాఠశాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసి జీవించడం ద్వారా భిన్న సంస్కృతులను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. హాస్టల్‌ జీవితం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్‌ అఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌ డి.సంపత్‌ కుమార్‌ విద్యార్థులు హాస్టల్లో గడిపే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకొని విద్యతో పాటు మంచి నడవడి, సేవాభావం, స్నేహసౌహార్దాలను పెంపొందించుకోవాలని సూచించారు. అసోసియేట్‌ డీన్‌, చీఫ్‌ వార్డెన్‌ డా. పి. ప్రసూన రాణి మాట్లాడారు. బాలికల హాస్టల్‌ వార్డెన్‌ డా.కె.జయలలిత, బాలుర హాస్టల్‌ వార్డెన్‌ డా. కె. చంద్రశేఖర్‌ హాస్టల్‌ నివేదికలను సమర్పించారు.హాస్టల్‌ సిబ్బందికి నూతన వస్త్రాల బహూకరణ కార్యక్రమాన్ని బాలికల అడిషనల్‌ వార్డెన్‌ డా.ఎం.తుషార నిర్వహించగా, కన్వీనర్‌ డా. కె.సుశీల లక్కీ డిప్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలుర అడిషనల్‌ వార్డెన్‌ డా.పి.సుధా జాకబ్‌ వందన సమర్పణ చేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించగా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

నిధి సీడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.మోహన్‌ రావు

Advertisement
 
Advertisement
Advertisement