కల్పవృక్ష వాహనంపై నారసింహుడు
పొన్న వాహనంపై చిన్ని కృష్ణుడు నేడు స్వామి వారి కల్యాణోత్సవం
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేదీప్యమానంగా వెలుగొందుతూ మాడ వీధుల్లో విహరించారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు పరవశించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ పర్యవేక్షించగా, ఉత్సవ కై ంకర్యపరులుగా తిరుపతికి చెందిన గొంటుముక్కల రమణయ్య, సుగుణ దంపతులు వ్యవహరించారు. రాత్రి పొన్న వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సమయంలో స్వామిని దర్శించిన వారికి దేహాభిమానం తొలగి స్వామి కృపకు పాత్రులు అవుతారని భక్తుల నమ్మకం. పొన్న వాహన కై ంకపర్యపరులుగా మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వ్యవహరించింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
నేడు కల్యాణ వేడుక
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి కల్యాణ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. ఉదయం అశ్వ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారని, రాత్రి ఎదురుకోలు ఉత్సవం జరగనుందన్నారు.


