కట్న నిషేధ చట్టం కట్టుదిట్టంగా అమలు చేయాలి
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: కట్న నిషేధ చట్టం అమలు కట్టుదిట్టం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ బోర్డు రూమ్‌లో జరిగిన జిల్లా సలహా మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, నమోదైన కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. జాయింట్ కలెక్టర్ భావన, ఐసీడీఎస్ పీడీ రాధ మాధవి, డీఎస్పీ జగదీష్ నాయక్, ఎన్‌జీవో సభ్యులు పార్థసారథి, రవి ప్రదీప్, పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాములకు భద్రత ముఖ్యం
ఈవీఎం గోదాములకు నిరంతరం భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గోదాముల సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టర్ శనివారం వాటిని పరిశీలించారు. భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పని తీరును తెలుసుకున్నారు.
పింఛన్ పంపిణీ
బాపట్ల పట్టణం చిల్లర గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద లబ్ధిదారులైన బోయన ముసలయ్య, యశోదలకు నగదును కలెక్టర్ చేతుల మీదుగా శనివారం పంపిణీ చేశారు. మార్చి ఒకటో తేదీన ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు నగదును అందజేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 1,82,897 మందికి పింఛన్ మంజూరు కాగా, రూ.78,31,96,500 నగదు విడుదల అయ్యిందన్నారు.
వారధిగా జర్నలిస్టు పనిచేయాలి
జర్నలిస్టులు నాణ్యత, స్పష్టత ఉన్న వార్తలను సమాజానికి అందివ్వాలని, వారధిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు.


