విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి
నాదెండ్ల: విద్యుత్ షాక్‌కు గురైన మహిళ తీవ్రగాయాలపాలై గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... స్థానిక శివాలయం వీధిలో నివాసం ఉండే షేక్ ఫకీరమ్మ (31), బాజి దంపతులు. కూలి పనులు చేసుకుంటూ ఫకీరమ్మ జీవనం సాగిస్తోంది. జనవరి 28న ఇంట్లో దుస్తులు ఉతికి డాబాపై ఆరేసేందుకు వెళ్లింది. దుస్తులు ఆరేస్తుండగా ఇంటి పక్కనుంచి వెళ్లే విద్యుత్ లైనుకు తగిలి షాక్‌కు గురై డాబాపై నుంచి కిందపడింది. తీవ్రగాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను 108 వాహనంలో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. 50 శాతం కాలినగాయాలతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అప్పట్లో పోలీసులకు భర్త బాజి ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాజి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిండుప్రాణం గాల్లో కలిసింది. షేక్ ఫకీరమ్మ విద్యుత్‌షాక్‌కు గురైందన్న సమాచారం తెలుసుకున్న ఆ శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. డాబా మీదుగా ఓ లైను వెళ్తుండడంతో అదనంగా మరో స్తంభం ఏర్పాటు చేసి అటుగా వెళ్లే వైరును తొలగించారు. తమ కుటుంబానికి విద్యుత్‌శాఖ అధికారులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
షాక్‌కు గురై చికిత్స పొందుతూ
మహిళ మృతి
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి


