రైతులకు పుట్టగొడుగుల సాగుపై శిక్షణ
బాపట్ల: మాంసాహారాన్ని మించిన ప్రోటీన్లు పుట్టగొడుగులలో పుష్కలంగా ఉన్నాయని, మారుతున్న పర్యావరణానికి అనుగుణంగా పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం శ్రేయోదాయకమని బాపట్ల వ్యవసాయ కళాశాల మొక్కల తెగుళ్ల విభాగాధిపతి డాక్టర్ వి.ప్రసన్నకుమారి వివరించారు. తోటమాలపల్లి గ్రామంలో పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.పుట్టగొడుగుల ప్రాధాన్యాన్ని, దానిలోని పోషక విలువలను గురించి రైతులకు తెలియజేశారు. పుట్టగొడుగుల పెంపకంపై వారికి పూర్తి అవగాహనను కల్పించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ సలాం పుట్టగొడుగుల పెంపక విధానాన్ని రైతులకు సమగ్రంగా వివరించారు. వ్యవసాయ కళాశాల నాలుగవ సంవత్సరం ఈ.ఎల్.పి. విద్యార్థులు ఈ పుట్టగొడుగుల పెంపక విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. యువ రైతులు చురుగ్గా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రైతులకు వరిగడ్డి సంచి, విత్తనములు, భావిష్టిన్ బ్యాగు, పుట్టగొడుగులను సాగు చేసే విధానం గురించిన పుస్తకాన్ని అందించారు.


