టీడీపీలో గౌరవం లేదు.. అందుకే రాజీనామా
పార్లమెంట్ జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగన్న
చీమకుర్తి: ‘టీడీపీ విజయాలలో ఎంతో కృషి చేశాను. 2014 ఎన్నికల నుంచి ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ వెంటే నడిచి ఆయన గెలుపునకు అహర్నిశలు పనిచేశా. కానీ పార్టీలో నాకు ఏ మాత్రం గౌరవం, విలువ లేవు...’ అంటూ బాపట్ల పార్లమెంట్ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అవశనేని వెంగన్న ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇమడలేకనే ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెంగన్న తన రాజీనామా లేఖను శుక్రవారం చీమకుర్తిలో మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంగన్న సాక్షితో మాట్లాడుతూ... 2014 మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ గెలుపుకోసం పనిచేశాను కాబట్టే అప్పటి మున్సిపల్ ఎన్నికలలో గెలిచిందని గుర్తు చేశారు. చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలో కాపు సామాజిక వర్గానికి చెందిన అవిశనేని వెంగన్న మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాలు ప్రారంభించారు. అనంతరం ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో 2014 ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న బీఎన్ విజయకుమార్ వెంట తన వర్గంతో టీడీపీలో చేరి నడిచారు. తాజాగా టీడీపీలో కుల రాజకీయాల ఆధిపత్యంలో తనకు, తన సామాజిక వర్గానికి ఏమాత్రం గౌరవం లేని ఇమడలేకపోయారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టీపట్టనట్లుగా వ్యవహరించటంతో పార్టీకి రాజీనామా చేశారు. అవిశనేని వెంగన్న రాజీనామా ప్రభావంతో రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో టీడీపీకి నష్టం తప్పదని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.


