ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ కుట్రలు | - | Sakshi
Sakshi News home page

ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ కుట్రలు

Feb 9 2026 7:34 AM | Updated on Feb 9 2026 7:34 AM

ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ కుట్రలు

ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ కుట్రలు

అందుకే తిరుమల లడ్డూ కల్తీ అంటూ అసత్య ఆరోపణలు ఎన్నికల హామీలు మరిచి ప్రజలను మోసగించిన టీడీపీ ప్రభుత్వ వైద్య కళాశాలలను విక్రయానికి పెట్టిన చంద్రబాబు వైఎస్సార్‌ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగ నాగార్జున, రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ ఈవూరు గణేష్‌ ధ్వజం

చెరుకుపల్లి: రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని అబద్ధపు ఆరోపణలు చేస్తోందని, వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్షపూరిత దాడులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగ నాగార్జున ఆరోపించారు. మండలంలోని గుళ్ళపల్లి గ్రామంలో డాక్టర్‌ ఈవూరు గణేష్‌ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామిని కూడా అపవిత్రం చేశారన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే ఒక అసత్య ప్రచారానికి తెరలేపి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన బృందం ఇలా పైశాచిక ఆనందం పొందుతోందని ధ్వజమెత్తారు. లడ్డూ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, అత్యున్నత న్యాయస్థానాలు సైతం కల్తీ జరగలేదని తేల్చి చెప్పినా కూడా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల ప్రసాదాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు పవిత్రంగా భావిస్తూ స్వీకరిస్తుంటే దానిని దెబ్బతీసేలా ఫినాయిల్‌ కూడా కలిసిందని టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం దారుణమని పేర్కొన్నారు. మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేయటం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. పరిపాలన తీరుపై ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ నాయకులపై, కార్యకర్తలపై విచక్షణరహితంగా దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇది మంచి సంస్కృతి కాదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వ బెదిరింపులను లెక్క చేయకుండా గుంటూరులో మంత్రి అంబటి రాంబాబు ఇంటికి, ఇబ్రహీంపట్నంలో మంత్రి జోగి రమేష్‌ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు ప్రజలు వెంట నడిచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా పేదలకు సంక్షేమం అందిస్తూనే విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్య అందించారని తెలిపారు.

దౌర్భాగ్యపు సీఎం

అనంతరం వైఎస్సార్‌ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ ఈవూరు గణేష్‌ మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థికి వైద్య విద్య అందాలనే పట్టుదలతో ఆనాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్ని అనుమతులతో 17 మెడికల్‌ కళాశాలలను కట్టించాలని నిర్ణయించారన్నారు. నేడు అది కూడా ఓర్వలేక ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను అమ్ముకునేందుకు మార్కెట్‌లో పెట్టిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి చంద్రబాబు అని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న దాడులను, లడ్డూపై చేస్తున్న అసత్య ప్రచారాలను ఆపి వేసి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని డాక్టర్‌ మేరుగ నాగార్జున, డాక్టర్‌ ఈవూరు గణేష్‌లు వెంకటేశ్వరస్వామిని ప్రార్థించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్‌ దుండి వెంకట రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement