ఘనంగా నరసింహస్వామి తెప్పోత్సవం
అల్లూరు(కర్లపాలెం): శ్రీ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం కనుల పండువగా నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ రాజ్యలక్ష్మీ సమేత నరసింహస్వామి ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా జరిగి ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పడవపై ఉంచి విశేష అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం తెనాలి నిజాంపట్నం కాలువలో అల్లూరు శివారు రెడ్లపాలెం నుంచి పిట్టలవానిపాలెం సెంటర్ వరకు తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తెప్పోత్సవానికి వచ్చి కనులారా స్వామివారిని తిలకించి భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. స్వామివారికి టెంకాయలు కొట్టి హారతులిచ్చారు. చందోలు ఎస్‌ఐ ఎంవీ శివకుమార్ యాదవ్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.


