అంతరరాష్ట్ర దొంగ అరెస్ట్
బంగారం, నగదు స్వాధీనం
చీరాల: అంతరాష్ట్ర దొంగను చీరాల వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను డీఎస్పీ ఎండీ మొయిన్ వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ నెలలో వేటపాలెం మండలం కేపాల్ కాలనీలో పుట్టా ఫణిరాజా ఇంట్లో నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన రామనాథం కిరణ్ అనే వ్యక్తి చోరీకి పాల్పడి 15 సవర్ల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాలతో కేసు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చీరాల రైల్వేస్టేషన్ సమీపంలో నిందితుడు ఉన్నట్లు పక్కా సమాచారంతో అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు చీపుర్లు అమ్ముకునే స్థాయి నుంచి ఘరానా దొంగతనాలకు మారాడు. ఇప్పటి వరకు నిందితుడుపై పలు చోట్ల 65 దొంగతనాల కేసులున్నాయి. ఇతను కరుడుగట్టిన నేరస్తుడుగా పోలీసులకు సవాల్‌గా మారాడు. ఈ క్రమంలో నిందితుడి వద్ద నుంచి రూ.21లక్షల విలువ చేసే బంగారంతో పాటు రూ.20వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు, మహిళా ఎస్సై జి.రాజ్యలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.


