సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకోండి
చీరాల టౌన్: గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉండాలి.. సమస్యలు ఏవైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి..గొడవలు, హత్యాయత్నాలకు తావివ్వకుండా పెద్దలు హుందాగా వ్యవహరించాలని ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు సూచించారు. గురువారం రాత్రి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఇటీవల గవినివారిపాలెంలో జరిగిన గొడవలు, హత్యాయత్నం ఘటనల నేపద్యంలో పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామస్తులతో కలిసి పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గవినివారిపాలెంలో జరిగిన ఘర్షణలకు గల కారణాలను గ్రామస్తుల నుంచి, ఫిర్యాదుదారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతు...ప్రశాంత వాతావరణానికి గ్రామాలు కీలకంగా ఉండాలే కానీ గొడవలు, హత్యాయత్నాలు, ఘర్షణలకు తావివ్వకూడదన్నారు. గ్రామంలోని ప్రజల మధ్య ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ప్రభుత్వ అధికారులైన పోలీస్, రెవెన్యూ, అధికారుల దృష్టికి తీసుకురావాలే కానీ వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు పాల్పడటం చట్ట వ్యతిరేకమన్నారు. అధికారులు అందరు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారని సమస్యలను సత్వరమే పరిష్కరించి న్యాయం చేస్తారని గుర్తుంచుకోవాలన్నారు. గొడవలకు పాల్పడినా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉండేలా పీస్ కమిటీ పనిచేయాలన్నారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ అభిషేక్, తహసీల్దార్లు కె.గోపికృష్ణ, జె.ప్రభాకరరావు, రూరల్ సీఐ శేషగిరిరావు, రూరల్ ఎస్‌ఐ అంబటి చంద్రశేఖర్, గవినివారిపాలెం గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
ఘర్షణలకు చోటివ్వవద్దు
సమస్యలు ఉంటే అధికారుల
దృష్టికి తేవాలి
గవినివారిపాలెం గ్రామస్తులతో
ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు


