వీధి కుక్కల నియంత్రణకు సహకరించాలి
నెహ్రూనగర్: నగరంలో వీధికుక్కలకు కుటుంబ నియంత్రణ, యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ అవసరమని, అందుకు జంతు ప్రేమికులూ సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అభ్యర్థించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో జంతు ప్రేమికులు, పశుసంవర్ధక శాఖ, నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ అధికారులతో ఏబీసీ నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ వీధి కుక్కల కుటుంబ నియంత్రణ, సంక్షేమానికి సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తామని చెప్పారు. నగరంలో వీధి కుక్కల సమస్యలపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని, ఇటీవల ఇద్వా నగర్‌లో కుక్క దాడిలో ఐజాక్ అనే బాలుడు మృతి చెందడం భాదకరమన్నారు. ప్రస్తుతం నగరంలో పశుసంవర్ధక శాఖ లెక్కల మేరకు 35 వేలకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని, వీటికి నగరపాలక సంస్థ ఏటుకూరు రోడ్ లోని ఏబీసీ చేస్తుండగా కొందరు జంతు ప్రేమికుల పేరుతో లేవనెత్తిన ఫిర్యాదుల మేరకు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నారు. కేంద్ర బృందం పరిశీలన అనంతరం వారి సూచనల ప్రకారం తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏబీసీ ఆపరేషన్లు వెంటనే పునఃప్రారంభం చేయడానికి పశుసంవర్ధక శాఖ నుంచి 5 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లను నియమించిందన్నారు. స్టేరిలైజేషన్ చేసిన కుక్కలను అదే ప్రాంతంలో వదిలేలా, చేసిన వాటికీ ప్రత్యేక ట్యాగ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సదరు కార్యకలాపాలను జంతు ప్రేమికులు కూడా నేరుగా పరిశీలించవచ్చన్నారు. అనంతరం జంతు ప్రేమికులు చెప్పిన అంశాలను, ఫిర్యాదులపై కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్య పరిష్కారం చేసుకుంటూ, ఏబీసీ నిర్వహణ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం, పశుసంవర్ధక శాఖ నుండి డాక్టర్ చక్రవర్తి, ఈశ్వరరెడ్డి, జీఎంసీ విఏఎస్ డాక్టర్ వెంకటేస్వర్లు, జంతు ప్రేమికులు ప్రదీప్ జైన్, తేజోవంత్, రాజ్యలక్ష్మీ, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్ పులి శ్రీనివాసులు


