మహిళల హక్కులకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

మహిళల హక్కులకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు

Apr 9 2025 2:09 AM | Updated on Apr 9 2025 2:09 AM

మహిళల హక్కులకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు

మహిళల హక్కులకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్‌ జె వెంకటమురళి

బాపట్లటౌన్‌: మహిళల హక్కులకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి హెచ్చరించారు. బాపట్ల పట్టణంలోని సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ను కలెక్టర్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గృహ హింస నుంచి రక్షణ కోరి వచ్చే బాధిత మహిళలకు సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ రక్షణ కవచంలా ఉండాలన్నారు. జిల్లాలో ఏర్పాటైన సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు. సమాజంలోని మహిళలు వివిధ రూపాలలో గృహహింసకు గురవుతున్నారన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకే సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయన్నారు. జిల్లాలో ఎక్కడ నుండైనా, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనైనా మహిళలు ఉన్నట్లు సమాచారం వస్తే తక్షణమే సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ తమ కార్యకలాపాలను ప్రారంభించాలన్నారు. రాజకీయ ఒత్తిడిలు, ప్రలోభాలకు ఎట్టి పరిస్థితులలో గురికారాదన్నారు. అత్యవసరంగా బాధిత మహిళలు ఈ కేంద్రానికి వస్తే ఐదు రోజులపాటు ఆశ్రయం కల్పించే అంశాలపై ఆయన ఆరా తీశారు. ప్రస్తుతం కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాధిత మహిళతో కలెక్టర్‌ మాట్లాడారు. న్యాయ సలహాలు, సేవలు, వసతి సౌకర్యాలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఇక్కడ 14 పోస్టుల్లో 11 మాత్రమే భర్తీ కాగా, ఒక్కొక్కరిని పిలిచి, వారి విధుల నిర్వహణ గురించి తెలుసుకున్నారు. ఇద్దరు గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు. ఈ కేంద్రానికి పురుషులను ఎట్టి పరిస్థితులలో అనుమతించరాదన్నారు. ఎవరూ ఇక్కడకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తే బాధిత మహిళలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ డి.రాధామాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌ విజయమ్మ పాల్గొన్నారు.

అనాధ పిల్లల సంరక్షణలో

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

అనాధ పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్‌ జె వెంకటమురళి హెచ్చరించారు. పట్టణంలోని శిశు గృహం, బాలసదన్‌ను కలెక్టర్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులో 9 మంది అనాధ పిల్లలు ఉన్నట్లు రాశారు. వాస్తవంగా నలుగురు మాత్రమే ఉండడంపై నిర్వాహకులను ప్రశ్నించారు. ఏడాదిలోపు వయసు ఉన్న నలుగురు శిశువులనే ఇక్కడే ఉంచామని, మిగిలిన చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్నారని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనాధ శిశువులకు అందిస్తున్న పోషణ, వారి సంరక్షణ చర్యలు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సంబంధిత రికార్డులను ఆయన పరిశీలించారు. శిశు గహ మేనేజర్‌, మరొక సిబ్బంది విధులకు ఆలస్యంగా రావడంపై చార్జిమెమో జారీ చేయాలని ఆదేశించారు. ఏడాది బాలిక బలహీనంగా ఉండడంపై ఆరా తీసి చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఆదేశించారు. శిశు గృహంలో సీసీ కెమెరాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనాధ పిల్లలను కొడుతున్నట్లు సమాచారం వచ్చిందని, అలా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం బాలసదన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న అనాధ బాలికలు, పాక్షిక అనాధ బాలికల వివరాలపై ఆరా తీశారు. వసతులు, సౌకర్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ డి.రాధా మాధవి, డీసీపీఓ పురుషోత్తం తదితరులు ఉన్నారు.

అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి

ప్రగతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 2025–2026 ఆర్థిక సంవత్సరంలో 10వేల కుటుంబాలకు పాడి పశువులను అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించారన్నారు. లబ్ధిదారుల ఎంపిక చేయాలని పశు వైద్య శాఖ అధికారిని ఆదేశించామన్నారు. పశువుల నీటితొట్టెల నిర్మాణ లక్ష్యాలను ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వికలాంగులు, హెల్త్‌ పెన్షన్ల విషయమై డీఆర్‌డీఏ పీడీతో చర్చించారు. ప్రతి జిల్లాలో 10వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంచేందుకు లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఇందుకోసం జిల్లాలో ఒక్కొక్క పంచాయతీలో 50 ఎకరాల చొప్పున స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణపై మున్సిపల్‌ అధికారులతో జిల్లా కలెక్టర్‌ ఆరా తీశారు. అన్న క్యాంటీన్‌కి వచ్చే వారి వివరాలను నమోదు చేయాలన్నారు. వారి నుండి ప్రజాభిప్రాయం సేకరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, బాపట్ల, మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement