కానిస్టేబుల్‌కు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు
వేటపాలెం: దేశాయిపేట పంచాయతీ ప్రసాద్‌నగర్‌లో వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ బిల్లా రమేష్ భౌతికకాయానికి పోలీస్ లాంఛనాలతో రూరల్ ఐఈ శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు సారథ్యంలో స్థానిక శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా రూరల్ సీఐ, ఎస్సై కానిస్టేబుల్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. రూరల్ సీఐ మాట్లాడుతూ 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ బిల్లా రమేష్ మృతి పట్ల ఎస్పీ తుషార్ డూడీ తన సంతాపం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారన్నారు. మట్టి ఖర్చుల నిమిత్తం కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ.25 వేలు నగదు పోలీసు అధికారులు అందజేశారు. తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


