పర్చూరులో బెట్టింగ్ బుకీలు
పర్చూరు(చినగంజాం)
పర్చూరులో బెట్టింగ్ బుకీలు రెచ్చిపోతున్నారు. యువకులను టార్గెట్ చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. యువకులను బెట్టింగ్ వెబ్‌సైట్‌లకు ఆకర్షితులను చేసి తద్వారా వచ్చే కమీషన్‌లను దండుకుంటున్నారు. బుకీల మాయమాటలకు ప్రలోభపడి నగదు అప్పు తెచ్చి మరీ బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఆ తర్వాత అప్పులు తీర్చలేని పరిస్థితులలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత యువతకు ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. క్రికెట్ మ్యాచ్‌లు మొదలైన రోజు నుండి ఆన్‌లైన్‌లో బెట్టింగులు జోరందుకున్నాయి. బెట్టింగ్‌కు పాల్పడుతున్న యువతను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన పోలీసు నిఘా విభాగం పూర్తిగా విఫలమైందని పలువురు విమర్శిస్తున్నారు.
ముగ్గులోకి దించుతున్న బుకీలు
క్రికెట్ బెట్టింగ్ జరిగే విధానాన్ని చూసి అందరూ బిత్తర పోతున్నారు. బెట్టింగ్‌లో పాల్గొనదలచిన వారు తొలుత తమ పేర్లను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం వన్ ఎక్స్ బెట్, రెడ్డి అన్న బుక్, ఫెయిర్ బెట్ తదితర బెట్టింగ్ వెబ్‌సైట్‌లు లీడింగ్‌లో ఉన్నాయి. వన్ ఎక్స్ బెట్ యునైటెడ్ కింగ్ డమ్ కేంద్రంగా పనిచేస్తుండగా, రెడ్డి అన్న బుక్ ఫెయిర్ బెట్ చైన్నె కేంద్రంగా పనిచేస్తున్నాయి. వీటిలో బెట్టింగ్ రాయుళ్లు ముందుగా తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్న తరువాత కంపెనీ వారు ఒక క్యూఆర్ కోడ్‌ను పంపుతారు. క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసి మన ఖాతాలో ఉన్న డబ్బులను బెట్టింగ్ వెబ్‌సైట్ ఖాతాలోకి మళ్లిస్తారు. మనం పంపించే డబ్బులను పాయింట్‌లలో లెక్కిస్తారు. ఉదాహరణకు మనం రూ.500 బెట్టింగ్ వెబ్‌సైట్‌లోకి మరలిస్తే మనకు కంపెనీ వారు 500 పాయింట్లు ఇస్తారు. వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కాబడిన వ్యక్తి ఇతర వ్యక్తులను కంపెనీకి రిఫర్ చేసినట్లయితే ఒక్కో వ్యక్తికి ఐదు పాయింట్లు చొప్పున కంపెనీ అతనికి అదనంగా ఇస్తుంది. ఈ అదనపు పాయింట్లే కమీషన్ కాగా ఇవి రిఫర్ చేసిన వ్యక్తి ఖాతాలోకి పాయింట్ల రూపంలో వెంటనే జమ అవుతాయి. ఈ విధంగా వేరే వ్యక్తులను బెట్టింగ్ కంపెనీలకు రిఫర్ చేసి కమీషన్‌లు దండుకునే చిన్నచిన్న బుకీలు ప్రస్తుతం పర్చూరులో తయారయ్యారు. క్రికెట్ ఆట మొదలైన తరువాత ఏ టీమ్‌కు గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయో ఆ టీమ్‌పై బెట్టింగ్ పెడతారు. క్రికెట్ ఆట జరిగేటప్పుడు మనం బెట్టింగ్ పెట్టిన టీమ్ ఓడిపోయే అవకాశం ఉందని భావిస్తే వెంటనే బెట్టింగ్ డబ్బులను మరో టీమ్‌పైకి మార్చుకోవచ్చు. అయితే తొలుత ఒక రూపాయికి 10 రూపాయలు వచ్చినట్లు బెట్టింగ్ వెబ్‌సైటు వారు నమ్మిస్తారు. వచ్చిన చిన్నపాటి నగదును మన ఖాతాలో వెంటనే జమచేస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు నేరుగా నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా మన ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తారు. శని, ఆదివారాలలో అయితే ఫోనేఫే, గూగుల్ పే, పేటీఎం యాప్‌ల ద్వారా జమ చేస్తారు. మనం ఎక్కువ మొత్తంలో నగదు గెలుచుకున్నప్పుడు వాటిని మన ఖాతాలోకి మళ్లించకుండా మన అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు. మ్యాచ్‌ని ఓడిపోయే సమయంలో బోర్డుని మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఈ విధంగా బెట్టింగ్ కంపెనీ యువతను మోసం చేసి లాభాలను గడిస్తోంది.
కొరవడిన నిఘా
పోలీసులు రహస్యంగా గ్రామాల్లోని బెట్టింగ్ రాయుళ్ల వివరాలు సేకరించాలి. వారి బ్యాంక్ ఖాతాలను పరిశీలించి ఎక్కడి నుండి వారి ఖాతాలో తరచూ నగదు జమ అవుతుందో గమనించాలి. బెట్టింగ్ ఖాతాల నుంచి నగదు జమ అవుతుంటే అతడ్ని అనుమానించి అతని వద్ద నుంచి ఇతరుల పూర్తి సమాచారాన్ని రాబట్టాలి. బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
యువతకు రుణ సౌకర్యం
కమీషన్‌లకు కక్కుర్తి పడి యువతను పెడత్రోవ పట్టిస్తున్న వైనం
నిఘా విభాగం నిర్లక్ష్యం
మరింత రెచ్చిపోతున్న బుకీలు
పోలీసుల కంట పడకుండా పలు జాగ్రత్తలు
బెట్టింగులు పెట్టడానికి యువకుల వద్ద తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు ఉండాల్సిన పని లేదు. లోన్ యాప్‌ల ద్వారా రుణాలు పొందే అవకాశాలు ఇప్పుడు మెండుగా ఉన్నాయి. ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్ తదితర వివరాలతో లోన్ యాప్‌ల ద్వారా రుణాన్ని పొందవచ్చు. రుణంగా పొందిన డబ్బులు మొత్తాన్ని యువకులు అమాయకంగా బెట్టింగులలో పెట్టి పోగొట్టుకుంటున్నారు. అనంతరం లోన్ యాప్‌ల ద్వారా ఎదురయ్యే ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి.


