సముద్రంలోకి తాబేలు పిల్లలు విడుదల
వేటపాలెం: మండలం పరిధిలోని రామాపురం సముద్రతీరంలో అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్, ఐటీసీ బంగారు భవిష్యత్ సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర తాబేళ్ల రక్షణ కేంద్రం నుంచి 404 పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చేతుల మీదుగా గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ రకపు తాబేళ్లను సంరక్షించడం గొప్ప విషయం అని ఆయన అన్నారు. జిల్లా అటవీ శాఖాధికారి ఎల్.భీమయ్య మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 6 సముద్ర తాబేళ్లు రక్షణ కేంద్రాలు ఉన్నాయని గుర్తుచేశారు.
దాదాపు 145 తాబేళ్లు 15 వేల గుడ్లు పెట్టగా, కృత్రిమంగా పొదిగించి సముద్రంలోకి పిల్లలను వదులుతున్నట్లు చెప్పారు. చీరాల నియోజకవర్గం పరిధిలో రామచంద్రాపురం, పొట్టి సుబ్బయ్య పాలెం, రామాపురం గ్రామాలలో ఈ కేంద్రాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త శవనం చంద్రారెడ్డి, ఐటీసీ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సూరజ్ ప్రదాన, మాజీ సర్పంచ్ జంగిలి రాములు, రామాపురం గ్రామస్తులు సున్నపు సుబ్బారావు, రజని పాల్గొన్నారు.


