అన్నదాతకు అకాల కష్టం
కారెంపూడి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కర్షకులు నానా అవస్థలు పడ్డారు. నోటి దగ్గరకొచ్చిన పంటను కాపాడుకోడానికి రైతులు పడరాని పాట్లు పడ్డారు. కారెంపూడి మండలంలో కళ్లాల్లో ఉన్న మిర్చి, ధాన్యం, కందులు తడిసి పోకుండా వాటిని కుప్పలుగా చేసి పట్టలు కప్పడంలో రైతులు తలమునకలయ్యారు. పట్టలు తీసుకుని పొలాలకు ఉరుకులు పరుగులు పెట్టి పొలాలలో కళ్లాలలో ఉన్న పంట ఉత్పత్తులు తడిసిపోకుండా పట్టలు కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు. మబ్బులు పట్టగానే కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని, మిర్చిని చాలా మంది వచ్చిన ధరకు తెగనమ్మేశారు. ఇప్పటికే కళ్లాల్లో ఆరిన పంటలను గోతాలకు పట్టి ఇళ్లు చేర్చుకున్నారు.
కోతకు రబీ వరి.. కళ్లాల్లో మిర్చి, కంది
ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతో రైతుల గుండెలు దడదడలాడాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎక్కడ తడిసిపోతాయోనని వాటిని కాపాడుకోడానికి అష్టకష్టాలు పడ్డారు. మరో వైపు కంది కళ్లాలు జరుగుతున్నాయి. కళ్లాలను త్వరగా పూర్తి చేసేందుకు రైతు కూలీలు కష్టపడ్డారు. వర్షం రాకతో కళ్లం చేసిన గింజలతో కూడిన పొట్టును మిషన్‌లో పోసే అవకాశం కూడా లేకుండా పోయింది. మిరప కాయల కోతలు కూడా జరుగుతున్నాయి. దీంతో కోసిన కాయలు తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో వైపు రబీ వరి చేలన్నీ కోతకు వచ్చాయి. ఈ దశలో వర్షం పడితే గింజ పాడైపోతుందని గింజలు నేలపాలు అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఎరువుల కొట్లలో బాకీలున్న చిన్న సన్నకారు రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని జిలకర సన్నాలు 75 కిలోల బస్తా రూ.1540కే తెగనమ్మారు. కొనేనాథుడు లేడని, వర్షం వల్ల బతిమాలి పంటను అమ్మాల్సిన దుస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాచర్లలో భారీ వర్షం
మాచర్ల: అత్యధిక ఎండతో ఇబ్బంది పడుతున్న మాచర్ల వాసులకు మారిన వాతావరణం కాస్తంత ఉపశమనం కలిగించింది. గురువారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మికంగా మార్పు వచ్చి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు సేద తీరారు. పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు పారింది.
కోతకొచ్చిన రబీ వరి పంట
కళ్లాల్లోనే మిర్చి, కంది
వాటిని కాపాడుకునేందుకు రైతుల తంటాలు
వర్షం దెబ్బకి వరిని నష్టానికి అమ్ముకున్న కొందరు రైతులు


