హత్యాయత్నం కేసులో ఐదుగురు అరెస్ట్
పరారీలో మరో నిందితుడు
చీరాల: స్థలం విషయంలో తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారి తీసింది. ఈ సంఘటన చీరాల రూరల్ మండలం గవినివారిపాలెంలో గత నెల 28న జరిగింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను ఈపూరుపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు డీఎస్పీ ఎండీ మోయిన్ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. చీరాల మండలం గవినివారిపాలెంలో చీదరబోయిన లక్ష్మీనారాయణ ఇంటి ముందు స్థలంలో రాములమ్మ భూమి ఉంది. అక్కడ పాత ఇల్లు కూల్చి కొత్తగా నిర్మిస్తున్నారు. స్థలం హద్దుల విషయంలో గొడవలు జరిగాయి. చీదరబోయిన లక్ష్మీనారాయణ మేనల్లుడు అయిన రైల్వే పోలీస్ కానిస్టేబుల్ పిన్నిబోయిన లక్ష్మీనారాయణ ఈ గొడవలలో జోక్యం చేసుకున్నాడు. గత నెల 28న రాములమ్మతో చీదరబోయిన లక్ష్మీనారాయణ కుమారుడు భరత్‌కుమార్ గొడవ పెట్టుకున్నాడు. రాములమ్మకు ఆమె మనుమడు సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చీదరబోయిన నాగేశ్వరరావు మద్దతుగా వచ్చాడు. నాగేశ్వరరావును హత్య చేస్తే తమకు అడ్డు ఉండదని ప్రత్యర్థులు నిర్ణయించుకుని ఇంటి ముందు కూర్చొని ఉన్న అతడిపై కత్తితో దాడి చేశారు. స్థానికులు రావడంతో నిందితులు పరారయ్యారు. నిందితులను కావూరివారిపాలెం జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. చీదరబోయిన లక్ష్మీనారాయణ, చీదరబోయిన వీరయ్య, చీదరబోయిన భరత్‌కుమార్, గొర్ల వేణు, వెంపరాల కుమారస్వామిలు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. పిన్నిబోయిన లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నాడు. డీఎస్పీతోపాటు రూరల్ సీఐ శేషగిరిరావు, రూరల్ ఎస్సై చంద్రశేఖర్, సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు.


