పొగాకు రైతులను ముంచిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులను ముంచిన ప్రభుత్వం

Mar 24 2025 2:27 AM | Updated on Mar 24 2025 2:27 AM

పొగాకు రైతులను ముంచిన ప్రభుత్వం

పొగాకు రైతులను ముంచిన ప్రభుత్వం

బాపట్ల: పొగాకు రైతులను రాష్ట్ర ప్రభుత్వం నట్టేట ముంచేసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ పలెపోగు రాంబాబు ధ్వజమెత్తారు. పొగాకుకు తగిన ధర లేనప్పుడు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా రూ.200 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేటాయించి మార్క్‌ఫెడ్‌తో కొనుగోలు చేయించారని గుర్తుచేశారు. రైతులను ఆదుకున్నారని రాంబాబు పేర్కొన్నారు. బాపట్లలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ.. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతులు కనీస మద్దతు ధర కూడా రాకపోవటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. పొగాకు బోర్డులు మద్దతు ధర లభించేలా చూడటంలో నిర్లక్ష్యంగా ఉన్నాయని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు క్వింటా రూ. పది వేలు పలకగా.. ఇప్పుడు రూ. నాలుగు వేలకైనా అడిగేవారే లేరన్నారు. బర్లీ పొగాకుకు అమెరికా, బ్రిటన్‌ వంటి ప్రాంతాల్లో డిమాండ్‌ ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొనే పరిస్థితి లేదన్నారు. గిట్టుబాటు ధర కల్పించకుంటే ఆందోళనకు దిగుతామని రాంబాబు హెచ్చరించారు. రైతులతో కలిసి వెల్లంపల్లిలోని పొగాకు బోర్డు వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నామని తెలిపారు.

భారీగా పెరిగిన ఖర్చులు

వైఎస్సార్‌సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఈద శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పొగాకు సాగుకు ఖర్చులు పెరిగాయని, గిట్టుబాటు ధర మాత్రం లేకపోవటంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. పొగాకు చెక్కు గిడ్డంగుల్లో పెట్టుకున్నందుకు గతంలో రూ.400 ఉంటే ఇప్పుడు రూ.720 వసూలు చేస్తున్నారని చెప్పారు. శనగ, మిర్చి రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు కొండలరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, యువత జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గవిని కృష్ణమూర్తి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, నాయకులు జోగి రాజా, నర్రావుల వెంకట్రావు, తన్నీరు అంకమ్మరావు, కటికల యోహోషువా తదితరులు పాల్గొన్నారు.

గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతన్న

అన్నదాతలను ఆదుకోకపోతే

ఉద్యమానికి సిద్ధం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement