లిఫ్ట్ ఇచ్చి.... లూటీ చేశాడు
● వృద్ధురాలు మెడలో 27 గ్రాములు బంగారు గొలుసును దోచుకెళ్లిన వాహన చోదకుడు ● పెదకూరపాడు పోలీస్ స్టేషనలో ఫిర్యాదు
పెదకూరపాడు : సాయం చేసినట్లు చేసి వృద్ధురాలు మెడలోని 27 గ్రాముల బంగారం గొలుసుని లాక్కొని ద్విచక్ర వాహనదారుడు ఉడయించిన సంఘటన మండలంలోని పరస – ఖమ్మంపాడు గ్రామంపాడు గ్రామాల మధ్య శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని 75 త్యాళ్లూరు గ్రామానికి చెందిన 70 సంవత్సరాల ఈదా సామ్రాజ్యం పరస గ్రామంలో ఉంటున్న తన మనవడు అంజిరెడ్డి గృహానికి శనివారం ఉదయం వచ్చింది. అంజిరెడ్డి కంభంపాడు, జనాలపురం గ్రామాల మధ్య ఒక ఎకరం మిరప తోట సాగు చేస్తున్నాడు. సామ్రాజ్యం మధ్యాహ్న భోజనం ముగించుకొని తన మనవడు మిరప పొలాన్ని చూసేందుకు బయలుదేరారు. పరస జంక్షన్ వద్ద మిరప పొలానికి వెళ్లేందుకు నిలిచి ఉండగా కంభంపాడు గ్రామం వైపు వెళుతున్న యువకుడి ద్విచక్ర వాహనాన్ని లిఫ్ట్ అడిగింది. వాహనదారుడు వృద్ధురాలను ఎక్కించుకొని మార్గమధ్యంలో ఆమె మెడలో ఉన్న 27 గ్రాముల బంగారం గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. వెంటనే వృద్ధురాలు సామ్రాజ్యం తన మనవడు అంజిరెడ్డికి సమాచారం ఇచ్చి పెదకూరపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సంఘటన స్థలానికి చేరుకొని వృద్ధురాలు వద్ద వివరాలు సేకరించి, దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించారు.


