మార్టూరు: జాతీయ రహదారిపై కారు టైరు పేలడంతో అదుపుతప్పి చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి గ్రామ సమీపంలో జరిగింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది రవి, స్థానికుల కథనం ప్రకారం వివరాలు... విశాఖపట్నానికి చెందిన భీమన నవీన్ (32) గుంటూరుకు చెందిన తన స్నేహితుడి కుటుంబ సభ్యులైన నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక పాపతో కలిసి తమిళనాడు తీర్థయాత్రకు వెళ్లాడు. యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో బొల్లాపల్లి టోల్గేట్ దాటిన కాసేటికే వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ముందు టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో కారు అదుపుతప్పి రహదారి పక్కన కాలువ కల్వర్టును వేగంగా ఢీకొంది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న నవీన్ ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయినప్పటికీ ఛాతీ కారు ముందు భాగానికి ఒత్తుకొని తీవ్రంగా గాయపడ్డాడు. కారులో ఉన్న వారిలో చితర జయభారతి, కసినికోట భావన, అఖిల్‌లు గాయాలపాలయ్యారు. సమీపంలో ఉన్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది రవి పోలీసులకు సమాచారాన్ని అందించారు. హైవే అంబులెన్స్ వాహనంలో క్షతగాత్రులను ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నవీన్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. మార్టూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.