జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల టౌన్: ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులతో స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,200 మందికి మించి ఓటర్లు ఉండరాదనే నిబంధన ఉల్లంఘించరాదని తెలిపారు. విభజన ప్రక్రియకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. బాపట్ల జిల్లాలో 12,91,415 ఓటర్లు ఉన్నారన్నారు.వీరిలో 6,29,578 మంది పురుషులు, 6,61,756 మంది మహిళలు, మిగిలిన 81 మంది ఇతర ఓటర్లు అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,510 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. 1,100 ఓటర్లులోపు ఉన్న కేంద్రాలు 1,270 అన్నారు. 1,101 ఓటర్లకు మించిన కేంద్రాలు 250 ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రెండు కిలోమీటర్లకు మించి పోలింగ్ కేంద్రం ఓటర్లకు దూరంగా ఉండరాదన్నారు. దీనిపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో ప్రతినెల నియోజకవర్గం, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఓటర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఓటు హక్కు కొరకు జనవరి నుంచి ఇప్పటివరకు 2,399 దరఖాస్తులు రాగా, 382 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లాలోని 319 మంది ఓటర్లు విదేశాల్లో ఉంటున్నారని తెలిపారు. 2,187 మంది వీఐపీ ఓటర్లు ఉండగా, దివ్యాంగ ఓటర్లు 14,551 మంది ఉన్నారన్నారు. 4,532 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని వివరించారు. ప్రతి ఓటరుకు ఆధార్ అనుసంధానం చేయాలన్నారు. ఆధార్ అనుసంధానంలో 1.92 లక్షల ఓట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తక్షణమే పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, బీజేపీ నాయకులు రామకృష్ణ, సీపీఎం నాయకులు గంగయ్య, కాంగ్రెస్ నాయకులు డి.రవికుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు ఐ.మాల్యాద్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బాలాజీ, బి.ఎస్.పి. నాయకులు కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు షేక్ గౌస్ బాషా, జనసేన నాయకులు శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.