భవిష్యత్‌పై బెంగ లేదు  | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌పై బెంగ లేదు 

Published Wed, Jan 3 2024 4:15 AM

Jagan Mohan Reddy is implementing the Navratna schemes in AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. 

భవిష్యత్‌పై బెంగ లేదు 
ఏడాది వయసులో నాకు పోలియో సోకింది. రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. నా పరిస్థితి చూసి మా అమ్మ, నాన్న చాలా ఆవేదన చెందారు. నా భవిష్యత్తుపై ఆందోళన చెందారు. మా నాన్న పదిహేనేళ్ల క్రితమే కాలం చేశారు. అమ్మ ఒక్కతే కుటుంబ పోషణ చేయడం చూడలేకపోయాను. నాలో పట్టుదల పెరిగి ఏదైనా వ్యాపారం చేసుకుని సొంతంగా ఎలాగైనా జీవించాలని నిర్ణయించుకున్నాను. నా సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా అమ్మకు అందించిన సంక్షేమ పథకాలు నాకు అండగా నిలిచాయి.

వాటిని సద్వినియోగం చేసుకుని నా ప్రయాణం పూలబాట వైపు సాగించాను. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలోని ధనరాజల తులసమ్మ ఆలయం సమీపంలో పూజా సామగ్రి, పూలు అమ్ముకునేందుకు చిన్నపాటి బడ్డీ కొట్టు ఏర్పాటు చేసుకున్నాను. మా అమ్మ లక్ష్మమ్మ డ్వాక్రా సంఘ సభ్యురాలు కావడంతో బ్యాంకు లింకేజీ ద్వారా లక్ష రూపాయలు రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించాను.

మా అమ్మకు వైఎస్సార్‌ ఆసరా కింద ఏడాదికి రూ.12 వేల వంతున వచ్చింది. ఆ మొత్తాన్ని కూడా వ్యాపారానికి పెట్టుబడిగా వాడుకుంటున్నాను. వ్యాపారం బాగుంది. నా జీవనానికి ఇప్పుడు ఎలాంటి ఢోకా లేదు. నాకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు. నాకు ప్రతి నెల అందుతున్న దివ్యాంగ పింఛన్‌ రూ.3 వేలు నా పిల్లల పేరున పొదుపు చేస్తున్నా. భవిష్యత్తుపై బెంగ తీరింది.   – దువ్వు జగ్గారావు, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం మండలం (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్‌) 

అప్పు చేయకుండా బతుకుతున్నాం 
మాది కిరాణా వ్యాపారం. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో నేను, మా ఆయనా కలసి వ్యాపారం సాగిస్తున్నాం. 30 ఏళ్లుగా డ్వాక్రా సభ్యురాలిగా ఉండటంతో లక్ష రూపాయలు బ్యాంకు రుణం తీసుకుని వ్యాపారం చేస్తున్నాను. తద్వారా వచ్చిన ఆదాయంతో అతి కష్టమ్మీద రుణం తీర్చాం. మళ్లీ పెట్టుబడికి చాలా ఇబ్బంది పడ్డాం. మళ్లీ అప్పు చేయాలేమోనని సతమతం అవుతున్న సమయంలో ఈ ప్రభుత్వం వచ్చింది.

వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా ఇప్పటి వరకూ రూ.71 వేలు అందింది. దాంతో పెట్టుబడికి ఇబ్బంది లేకుండా పోయింది. దీంతోపాటు స్త్రీ నిధి నుంచి కూడా రూ.50 వేలు సహాయం అందడంతో కుటుంబానికి ఆధారంగా ఉన్న కిరాణా షాపు నిర్వహణ మరింత సులభమైంది. ఇప్పుడు దానితోనే రొటేషన్‌ చేస్తూ అప్పు చేయనవసరం లేకుండా వ్యాపారం సాగుతోంది. మా ఏకైక కుమార్తెకు వివాహం అయింది. ఆమెకు కూడా డ్వాక్రా రుణమాఫీ (ఆసరా) వర్తించింది. జగనన్న సాయంతో ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాం.     – గన్నమని అచ్చాయమ్మ, డ్వాక్రా మహిళ, మండపాక  (కొడమంచిలి కృష్ణ, విలేకరి, తణుకు) 

ఉన్నత చదువు కల తీరింది 
మాది పేద కుటుంబం. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం రొంపిల్లి గ్రామం. నా చదువు కోసం, బతుకుదెరువు కోసం విశాఖ నగరానికి వలస వచ్చాం. మా నాన్న శ్రీనివాసరావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అమ్మ సత్యవతి గృహిణి. ఇద్దరు అక్కలకు వివాహమైంది. నేను ఇంటర్‌ తర్వాత ఇంజినీరింగ్‌ చదవాలనుకున్నాను. కానీ అంత ఆర్థిక స్తోమత మాకు లేదు.

చదువు అంతటితో ఆగిపోతుందేమోనని భయపడ్డాను. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా చదువుకోవచ్చని స్నేహితులు ప్రోత్సహించారు. దీంతో తగరపువలస వద్ద అనిట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చేరాను. ఇప్పుడు నాలుగో సంవత్సరం చదువుతున్నాను. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.85 వేలు అందిస్తోంది. వసతి దీవెన పథకం కింద కూడా సాయం అందుతోంది.

దీంతో నా చదువు ప్రశాంతంగా సాగిపోతోంది. నాకు ఆరు నెలల క్రితం భరించలేని కడుపు నొప్పి (అపెండిసైటిస్‌) వచ్చింది. అత్యవసరంగా 24 గంటల్లో ఆపరేషన్‌ చేయాలని డాక్టర్‌ చెప్పారు. ఆపరేషన్‌ కోసం డబ్బులు సమకూర్చే పనిలేకుండా ఆరోగ్యశ్రీ ఆదుకొంది. రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్‌ జరిగింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. ఫైనల్‌ పరీక్షల కోసం చదువుకుంటున్నాను. ఊళ్లో అర ఎకరం పంట పొలం ఉంది. ఏటా రైతు భరోసా కూడా వస్తోంది.    – తాడ్డి మణికంఠ, ఆరిలోవ, విశాఖపట్నం (మీసాల కామేశ్వరరావు, విలేకరి, ఆరిలోవ, విశాఖపట్నం)  

Advertisement
 
Advertisement