బతుకుపై ఆశ పెంచిన పింఛన్‌ | Sakshi
Sakshi News home page

బతుకుపై ఆశ పెంచిన పింఛన్‌

Published Wed, Dec 27 2023 4:34 AM

Jagan Mohan Reddy is implementing the Navratna schemes in AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

బతుకుపై ఆశ పెంచిన పింఛన్‌
నాకు నలుగురు సంతానం. ఒక అబ్బాయి. ముగ్గురు అమ్మాయిలు. అందరికీ వివాహం చేశాం. ఆడపిల్లలంతా వేరేగా కాపురం ఉంటున్నారు. నా బాగోగులన్నీ చూస్తున్నది కొడుకు హేమనాథ్‌రావు, అతని భార్య దేవి. మాది శ్రీకాకుళం 50వ డివిజన్‌లోని బైరివానిపేట గ్రామం. నా భర్త చనిపోయాక కొన్నేళ్లపాటు వితంతు పెన్షన్‌ వచ్చింది. అప్పటికే నాకు కిడ్నీ వ్యాధి సోకింది. మందులు, ఇతరత్రా ఖర్చులకు వచ్చే పెన్షన్‌ సరిపోయేది కాదు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేదాన్ని. నా కొడుకు కార్పెంటర్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బుల్లోంచి కూడా మందులకు ఖర్చు చేసేవాడు.

డయాలసిస్‌ చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్లం. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక నాకు రూ.10,000 పెన్షన్‌ మంజూరైంది. ఈ పెన్షన్‌ నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు. బతుకుపై ఆశను కూడా కల్పించింది. ఒక్కోసారి తీవ్ర స్థాయిలో అనారోగ్యానికి గురైతే చేతిలో చిల్లిగవ్వ లేకపోయినప్పటికీ 108 అంబులెన్స్‌లో మాకు నచ్చిన ఆస్పత్రికి తీసుకెళ్లే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. ఆరోగ్యశ్రీ ద్వారా మాకు దగ్గర్లో గల కిమ్స్‌ ఆస్పత్రిలో వారానికి రెండుసార్లు, నెలకు పదిసార్లు డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగుంది.     – ఆర్‌.గన్నమ్మ, బైరివానిపేట, శ్రీకాకుళం (రాకోటి జగదీష్, విలేకరి, శ్రీకాకుళం రూరల్‌)

మేం నిలదొక్కుకున్నాం
మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. నా భర్త శ్రీనివాసులు పురుగు మందుల కంపెనీలో పని చేస్తున్నారు. ఆయన­కొచ్చే వేతనం మా జీవనానికే సరిపోవడం లేదు. ఇక పిల్లల చదువులు, ఇతర అవసరాలు ఎలా తీర్చాలో తెలియక సతమతమయ్యే­వాళ్లం. ఇదే తరుణంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మాకు వివిధ రకా­లుగా ఆర్థిక సాయం అందడంతో ఇప్పుడు మా బతుకు మారింది. నాకు వైఎస్సార్‌ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున అందుతోంది. గతంలో తీసుకున్న డ్వాక్రా రుణాన్ని ఈ ప్రభుత్వం మాఫీ చేయడంతో వైఎస్సార్‌ ఆసరా కింద కొంత మొత్తం నా ఖాతాలో జమ అయింది.

ఆ మొత్తంతో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇనుకుర్తి గ్రామంలో ఇంటి వద్ద చీరల అమ్మకాన్ని ప్రారంభించా. ఆదాయం అంతంత మాత్రమే వస్తుండడంతో పొదుపు సంఘం ద్వారా ఉమెన్‌ లెడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కింద పొదలకూరు కెనరా బ్యాంకులో రూ.2.30 లక్షలు లింకేజీ రుణం తీసుకున్నా. ఆ నగదుతో వ్యాపారాన్ని మరింతగా పెంచి అదనపు ఆదాయం పొందుతున్నా. మా పెద్దబ్బాయికి అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేల వంతున మూడేళ్లుగా నా ఖాతాలో జమ అవుతోంది. ఇప్పుడు పిల్లలను బాగా చదివించుకుంటున్నాం. వ్యాపారం బాగా సాగితే నెలకు రూ.15 వేల వరకు ఆదాయం వస్తోంది. బ్యాంకు రుణం సులభంగా తీర్చేస్తున్నా. ఈ ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే మేము జీవితంలో నిలదొక్కుకోగలిగాం.    – జి.లక్షీదుర్గ, పొదలకూరు, నెల్లూరు జిల్లా (కె.మధుసూధన్, విలేకరి, పొదలకూరు)

నాడు బీడు.. నేడు కళకళ
మాకు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు గ్రామంలో రెండున్నర ఎకరాల భూమి ఉంది. దానికి సరైన నీటి సదుపాయం లేకపోవడం వల్ల పంటలు దైవాధీనంగా మారాయి. జలయజ్ఞం కొనసాగింపుగా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలకళ పథకం కింద ఉచితంగా రిగ్గు వేసేందుకు మా మండలంలో 31 మందిని ఎంపిక చేశారు. అందులో నేనూ ఒకడిని. మూడేళ్ల క్రితం నా భూమిలో లక్ష రూపాయల ఖర్చుతో బోరు రిగ్గు పనులు చేశారు. మరో లక్ష రూపాయల వ్యయంతో విద్యుత్‌ లైను ఏర్పాటు చేశారు. రూ.30 వేల విలువ గల మోటారు సమకూర్చారు.

ఒకప్పుడు బీడుగా ఉన్న మా భూమి పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. పూటుగా సాగునీరు అందడంతో రెండున్నర ఎకరాల్లో జీడి మొక్కలు వేశాను. ఇప్పుడు అక్కడ పచ్చదనం సంతరించుకుంది. హైబ్రీడు మొక్కలు కావడంతో మరో రెండేళ్లలో పంట చేతికి వస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయికి వివాహం చేశాను. అబ్బాయి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి పెళ్లి చేయాల్సి ఉంది. మాకు సొంత ఇల్లు ఉంది. మేమంతా సంతోషంగా ఉన్నాం. – బీమారపు అప్పలనాయుడు, కొమరవోలు  (బి.ఎ.ఆనందం, విలేకరి, రోలుగుంట)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement