● మాక్ పోలింగ్‌కు
అనుమతించకపోవడాన్ని ప్రశ్నించిన చైర్మన్ అభ్యర్థిపై ఎస్‌ఐ దాడి
● ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
● ముఖాలకు మాస్కులు ధరించిన పచ్చముఠా స్వైరవిహారం
● పోలింగ్ కేంద్రాల్లోకి
దూరి రిగ్గింగ్ ప్రయత్నాలు
● రోజంతా ఉద్రిక్తతలు సృష్టించారు
● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై
మాస్కు గ్యాంగ్ దాడి
సాక్షి, మదనపల్లె / సాక్షి నెట్‌వర్క్: మదనపల్లెలో ఆదివారం జరిగిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ ఎన్నికల్లో టీడీపీ మూకలు అడుగడుగునా రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించారు. ముఖాలకు మాస్కులు ధరించిన యువకుల ముఠా నాలుగు కార్లలో పట్టణంలోని పోలింగ్ కేంద్రాల వద్ద సంచరిస్తూ హల్ చల్ చేశారు. ఈ పోలింగ్ సమయంలో ఎస్‌ఐ దాడిలో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటా చలపతి గాయపడ్డారు. ఏజెంట్ల విషయాన్ని ఆయన ప్రశ్నించగా ఎస్‌ఐ దాడి చేసి నెట్టడంతో ఆయన కిందపడి గాయపడ్డారు. పలు కేంద్రాల వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు, మాస్కులు ధరించిన ముఠా దాడులు చేసింది. గుమిగూడిన ఓటర్లు, పార్టీల శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు.
కార్యకర్తలపై దాడి..
మదనపల్లె పట్టణంలోని మేదర వీధి 29వ వార్డులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సుబ్రమణ్యంపై దాడి జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి ఉండగా మాస్కులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయాలు కావడంతో బాధితుడిని వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దక్నిపేట వార్డులో టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ కార్యకర్త షేక్ షాహీద్‌పై దాడిచేసి కొట్టారు.
మాస్కు ముఠా రిగ్గింగ్ ఆగడాలు..
మాస్కులు ధరించిన ముఠా పోలింగ్ సందర్భంగా రిగ్గింగ్ జరిపేందుకు ఆగడాలకు పాల్పడింది. వీరి వెంట టీడీపీకి చెందిన కొందరు వారికి సూచనలు చేస్తూ ఉండటం స్థానికులు గుర్తించారు. మొదట ఆర్‌అండ్‌బీ ఆవరణలో ఉన్న ఈ ముఠా ఒక్కసారిగా 12/1 పోలింగ్ కేంద్రంలోకి ముఖాలకు మాస్కులు ధరించి చొచ్చుకొచ్చారు. చైర్మన్ బ్యాలెట్ పత్రాలను లాక్కోవడంతో అప్రమత్తమైన ఎన్నికల సిబ్బంది వారితో ఎదురుతిరిగి బ్యాలెట్ పత్రాలను తిరిగి లాక్కొన్నారు. అక్కడినుంచి బీటీ కళాశాల, కృష్ణానగర్, సీఎస్‌ఐ, ఇందిరానగర్ తదితర కేంద్రాల వద్దకు వెళ్లి అక్కడ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించారు. కేంద్రాల వద్ద అరుపులు, కేకలతో ఉద్రికత్త సృష్టించారు. ఒకటవ వార్డు అమ్మ చెరువు మిట్ట పోలింగ్ కేంద్రంలో టీడీపీ రౌడీలు మాస్కులు ధరించి కేంద్రంలోకి జొరబడ్డారు. కిటికీలు తలుపులు మూసివేసి రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించారు.


