జమ్మలమడుగు: జమ్మలమడుగులో టీడీపీ, బీజేపీ గుండాలు పోలింగ్‌కేంద్రాలను హైజాక్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏజెంట్లకు సంబంధించిన గుర్తింపు కార్డులను చించివేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. గుర్తింపుకార్డులు ఇవ్వాలని అభ్యర్థులు పోలింగ్ అధికారులకు విన్నవించినా తమ వద్దలేవంటూ సమాధానం చెబుతూ వచ్చారు. పట్టణంలో 32 వార్డులకు 64 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఉదయమే ‘మీ పని మీరు చేసుకోండి మాపని మేము చేసుకుంటామని’ కూటమి నేతలు దౌర్జన్యం చేశారు. ఆపై పోలింగ్ కేంద్రాల ను ఆక్రమించుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను, ఏజెంట్లను బయటికి పంపించి యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చైర్‌పర్సన్ అభ్యర్థి ఎన్.హైమావతి ప్రభుత్వ బాలుర కాలేజికి చేరుకున్నారు. అప్పటికే ఏజెంట్లను బయటికి పంపించివేయడంతో ఆమె తమ నిరసన తెలియజేశారు.ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగవలసిన ఎన్నికలు పోలీసులే దగ్గరుండి అధికార పార్టీ నాయకులకు, రౌడీలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. సంజామల మోటులోఉన్న ఇంటి వద్దనుంచి నేరుగా బయటికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు తీవ్రంగా అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.


