● నిర్భయంగా వైఎస్సార్‌సీపీకి ఓటు వేయండి
● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు : కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీల గూండాలు చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలకు ఎవరూ భయపడకుండా.. ధైర్యంగా వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని చదళ్ల, మంగళం పంచాయతీలలో జెడ్పీటీసీ అభ్యర్థి వెంకటరమణతోపాటు ఆయా ప్రాంతాల ఎంపీటీసీ అభ్యర్థులతో కలసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేసి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఓటమి చెందుతుందన్న భయంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుని, దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండి పడ్డారు. పైగా నష్టపోయిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై హత్యాప్రయత్నం కేసులు పెట్టి, పోలీసులచే అరెస్ట్‌లు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వారికి దమ్ముంటే ఎన్నికల్లో పోరాడాలన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలే లేకుండా చేశారని మండిపడ్డారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి అనీషారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి
కురబలకోట : తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మండలంలోని ముదివేడులో ఆదివారం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేకి అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కె.ఫజరుల్లా, ఎంపీటీసీ అభ్యర్థి నల్లపరెడ్డి మంగమ్మతోపాటు వివిధ గ్రామాల పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా నాయకులు ఎం.ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ ఎన్నికలు కేవలం అభ్యర్థులకే కాకుండా ఆయా గ్రామాల నాయకుల సత్తాకు కూడా పరీక్షగా భావించాలన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ జెండాను ఎగరవేయాలన్నారు. కలసి సాగితే విజయం దాసోహం అవుతుందన్నారు. ప్రజలతో మమేకమవుతూ జనం మనసు గెలవాలన్నారు. ఎమ్మెల్యే ప్రచారంతో ఎన్నికలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రచారం పర్వం ఊపందుకుంది. పార్టీ శ్రేణులు దూసుకుపోతున్నాయి. నందిరెడ్డిగారిపల్లి ఎంపీటీసీ అభ్యర్థి సిద్దల శ్రీనివాసులరెడ్డి, చింతమాకులపల్లి అభ్యర్థి బుర్ర హరినాథ్, పిచ్చలవాండ్లపల్లి అభ్యర్థి దయ్యాల లలిత, అంగళ్లు వన్ అభ్యర్థి దేవరకొండ రెడ్డికుమారి, అంగళ్లు టు అభ్యర్థి మహబూబ్ పీర్, దాదంవారిపల్లిలో దాదం ఉషారాణి, కనసానివారిపల్లిలో రవళి, మట్లివారిపల్లిలో ఎన్.కనకదుర్గ, తెట్టులో జగదీష్, ఎర్రబల్లి అభ్యర్థి మౌనిక గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రచారం
పీలేరు రూరల్ : పీలేరు కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించాలని నియోజకవర్గ ఇన్‌చార్జి సోమశేఖర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆదివారం తలపుల, జాండ్ల, గూడరేవుపల్లెలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి షేక్ నౌజియాను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, రెడ్డిబాషా, మల్లిక, చెన్నకేశవ, ఇస్మాయిల్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.


