సింగిల్‌విండోలో నిధుల గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

సింగిల్‌విండోలో నిధుల గోల్‌మాల్‌

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

గుర్రంకొండ: మండలంలోని సింగిల్‌విండో కార్యాలయంలో రూ. 75 లక్షలకు పైగా నిధులు స్వాహా కావడం తీవ్ర కలకలం రేపుతోంది. గత రెండున్నరేళ్లుగా ఇన్‌చార్జి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనిల్‌కుమార్‌ గత 18 రోజులుగా విధులకు గైర్హాజరై పరారీలో ఉండడం, కార్యాలయానికి చెందిన బంగారు నగల లాకర్‌ తాళాలు కూడా అతని వద్దే ఉండడంతో లబ్ధిదారులు, రైతులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

రూ. 5.29 కోట్ల రుణాలు..

రూ. 75 లక్షల స్వాహా!

ఈ సింగిల్‌విండో పరిధిలో ఇప్పటివరకు మొత్తం రూ. 5.29 కోట్ల మేర రుణాలు మంజూరు చేశారు. అందులో పంట రుణాలు: 445 మంది రైతులకు రూ. 3,86,72,983 మంజూరు చేశారు. బంగారు రుణాలు: 249 మందికి రూ. 1,42,27,017 రుణాలు ఇచ్చారు. ఖాతాదారులు తమ బంగారు రుణాలు చెల్లించి నగలు తీసుకెళ్లినప్పటికీ, వారు కట్టిన రూ. 50 లక్షల సొమ్మును డీసీసీ బ్యాంకుకు జమ చేయకుండా సీఈవో అనిల్‌కుమార్‌ ఇతర వ్యక్తుల ఖాతాలకు మళ్లించి డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు 445 మంది రైతులకు ఇచ్చిన పంట రుణాల్లోనూ లోతుగా విచారణ జరిపితే మరో రూ. 25 లక్షల మేర అక్రమాలు బయటపడే అవకాశముందని రైతులు చెబుతున్నారు.

అధికారుల ఉదాసీనతే కారణమా?

గత రెండు సంవత్సరాలుగా నిర్వహించిన ఆడిట్లలో అక్రమాలు వెలుగుచూసినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 21న డీసీసీ బ్యాంకు ఏజీఎమ్‌ చంద్రళ విచారణ జరిపి రూ. 18 లక్షల నిధుల దుర్వినియోగాన్ని గుర్తించినప్పటికీ, కేవలం ఆ సొమ్మును రికవరీ చేసి వదిలేశారే తప్ప సీఈవోను సస్పెండ్‌ చేయలేదు. విచారణ ముగిసిన మరుసటి రోజు నుంచే అనిల్‌కుమార్‌ పరారీ కావడం గమనార్హం. స్థానిక బంగారు కుదవ వ్యాపారులతో, పక్క మండలానికి చెందిన మరో రెగ్యులర్‌ సీఈవోతో ఈయనకు అనధికారిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం.

లాకర్‌లో బంగారం భద్రమేనా?

గత 18 రోజులుగా సీఈవో రాకపోవడంతో పాటు, విలువైన రికార్డులు, నగదు ఉండే లాకర్‌ తాళాలు అతని వద్దే ఉండడంతో అసలు అందులోని బంగారం భద్రంగా ఉందా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకున్న రైతులు తమ సొమ్ముపై ఆరా తీశారు.

ఒకరిపై ఒకరు సాకులు చెబుతున్న పోలీసులు, పాలకవర్గం

సీఈవో ఫోన్‌ స్విచాఫ్‌ చేసి పరారీలో ఉండడంతో రోజువారీ కార్యకలాపాలు స్తంభించాయని, అందుకే ఈనెల 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశామని సింగిల్‌విండో ఛైర్మన్‌ ఎమ్‌ఎల్‌ఎన్‌ మూర్తిరావ్‌ తెలిపారు.పాలకవర్గం కేవలం సీఈవో విధులకు రావడం లేదని మాత్రమే ఫిర్యాదు చేసిందని, నిధుల గోల్‌మాల్‌పై ఉన్నతాధికారులు తమకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్‌ఐ రవీంద్రబాబు స్పష్టం చేశారు. సీఈవో కనిపించడం లేదనే మిస్సింగ్‌ కేసును ఆయన తల్లిదండ్రులు వారి సొంత గ్రామ పోలీస్‌ స్టేషన్‌లో పెట్టుకోవాలని సూచించారు.

రూ. 75 లక్షలకు పైగా స్వాహా?

18 రోజులుగా ఇన్‌చార్జి సీఈవో

విధులకు గైర్హాజర్‌

అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement