పెద్దమండ్యం : మండలంలోని వెలిగల్లు పంచాయతీ పాపదాతగారిపల్లెలో సంచలనం సృష్టించిన ఇరగమ్మ (53) అదృశ్యం కేసు రోజురోజుకూ మలుపులు తిరుగుతూ తీవ్ర మిస్టరీగా మారింది. ఆమె కనిపించకుండా పోయి 80 రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించకపోవడం స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఆమె నడిపిన కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలే ఈ అదృశ్యానికి కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
సెల్‌ఫోన్ లేకపోవడమే శాపమైందా?
గ్రామానికి చెందిన కొంకల రెడ్డెప్పరెడ్డి రెండో భార్య అయిన ఇరగమ్మ, ఆర్థికంగా చాలా బలమైన స్థితిలో ఉండేది. పెద్దమండ్యం పరిసర ప్రాంతాలతో పాటు కోటకొండ, నాయునివారిపల్లె, తంబళ్లపల్లె, అంగళ్లు తదితర గ్రామాల్లోని వ్యాపారులకు, రైతులకు ఆమె భూములు, బంగారం తాకట్టు పెట్టుకుని లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చేది. గత జూలై 18న ఓ ప్రామిసరీ నోటు రాయించుకోవడానికి పక్క పల్లెకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఆమె, తిరిగి రాలేదు. అయితే, ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నా ఇరగమ్మ సెల్‌ఫోన్ వాడకపోవడం గమనార్హం. ఒకవేళ ఆమె ఫోన్ ఉపయోగించి ఉంటే కేసు చేధించడం సులువుగా ఉండేదని, పోలీసులు అంటున్నారు. మొబైల్ లేకపోవడంతో ఆమె ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.
ఇరగమ్మ అదృశ్యమైన తర్వాత ఆమె నివాసానికి ప్రస్తుతం రెండు తాళాలు వేసి ఉన్నాయి. పిల్లలు లేని ఇరగమ్మ తల్లి కూడా గతంలోనే మృతి చెందింది. భార్య అదృశ్యంపై భర్త రెడ్డెప్పరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరుసటి రోజే ఇరగమ్మ బంధువులు ఆయనపైనే అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో కుటుంబంలో వివాదం చెలరేగడంతో.. రెడ్డెప్పరెడ్డి మొదటి భార్య కుమారుడు ఇరగమ్మ ఇంటికి మరో తాళం వేశాడు. కాగా, ఇదే అదునుగా ఇంటి తాళాలు పగలగొట్టి, లోపల భద్రపరిచిన విలువైన ప్రామిసరీ నోట్లు, నగదు, బంగారాన్ని మాయం చేశారని ఇరగమ్మ తరఫు బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేసు ఛేదించడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ క్రమంలో గత నెలలో కోటకాడపల్లె సమీపంలోని ఆకుమానిగుట్ట ప్రాజెక్టు ఎగువ తూములో ఒక మానవ పుర్రె, కొన్ని ఎముకలు లభ్యమవ్వడం తీవ్ర కలకలం రేపింది. ఆ అవశేషాలు ఇరగమ్మవేనని ప్రచారం సాగింది. అయితే అవి ఇరగమ్మవి కావని పోలీసులు స్పష్టం చేయడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది.
కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లాం
జూలై 18న మా వదిన కూతురైన ఇరగమ్మ అదృశ్యమైంది. పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఎవరో ఆమెకు కీడు చేసి ఉంటారని బలంగా అనుమానిస్తున్నాం. బంధువులమంతా కలిసి జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి వినతిపత్రం ఇచ్చాం. అధికారులు స్పందించి మా కూతురి ఆచూకీ త్వరగా కనుగొనాలి.
– దశరధరెడ్డి, ఇరగమ్మ చిన్నాన్న, గుర్రంవాండ్లపల్లె
80 రోజులుగా కానరాని ఆచూకీ!


