కలకడ : కలకడ మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కలకడ మండలం ఎర్రకోటపల్లె పంచాయతీ సింగనొడ్డుపల్లె గ్రామానికి చెందిన రైతు రమణ పలమనేరు నుంచి తన ద్విచక్ర వాహనంలో ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో, కదిరాయచెర్వు పంచాయతీ బొంతలవారిపల్లె గ్రామానికి చెందిన నాగరాజ బైక్‌లో స్వగ్రామానికి బయలుదేరారు. సింగనొడ్డుపల్లె మలుపు వద్దకు చేరుకోగానే.. రెండు వాహనాలు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రమణ, నాగరాజ ఇద్దరికీ తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించినట్లు బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.


