నేటి నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

● వైభవంగా పవిత్రోత్సవాల అంకురార్పణ

గుర్రంకొండ: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పవిత్రోత్సవాలకు సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో అక్టోబర్‌ 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఉత్సవాల ప్రారంభ సూచికగా శుక్రవారం ఆలయంలో అంకురార్పణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అంకురార్పణను పురస్కరించుకుని శుక్రవారం వేకువజామునే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అర్చక బృందం విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ శుద్ధ పుణ్యాహవాచనం, రక్షాబంధనం కార్యక్రమాలను వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. అనంతరం పవిత్ర అధివాసంతో తొలిరోజు వైదిక క్రతువులను ముగించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి.ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే వివిధ కై ంకర్యాలు, నిత్య పూజలు, అర్చనలు, విశేష సేవల్లో అర్చక సిబ్బంది వల్లగానీ, భక్తుల వల్లగానీ తెలిసీ తెలియక ఏవైనా దోషాలు దొర్లితే... వాటి ప్రాయశ్చిత్తంగా ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందని ఆలయ పండితులు తెలిపారు. ఈ పవిత్ర పూజల వల్ల సర్వాభీష్టములు సిద్ధించడమే కాకుండా, మనోవాక్కర్మలు పవిత్రమౌతాయని భక్తుల విశ్వాసం.

మూడు రోజుల ఉత్సవాల షెడ్యూల్‌:

అక్టోబర్‌ 10 : ఉదయం పవిత్ర మాలల ప్రతిష్ట, స్నపన తిరుమంజనం, యాగశాల కై ంకర్యాలు.

అక్టోబర్‌ 11 : స్వామివారికి పవిత్ర మాలల సమర్పణ, యాగశాల పూజలు.

అక్టోబర్‌ 12 : ఉదయం మహాపూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, పవిత్ర వితరణ, చక్రస్నానం. సాయంత్రం కనులపండువగా స్వామివారి తిరువీధి ఉత్సవం.

దంపతులకు ప్రత్యేక సేవ

పవిత్రోత్సవాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే భక్తులకు టీటీడీ అధికారులు ప్రత్యేక అవకాశం కల్పించారు. ఆసక్తి గల దంపతులు రూ. 300 చెల్లించి టికెట్‌ పొందవచ్చని తెలిపారు. ఈ సేవలో పాల్గొనే దంపతులకు ఒక పవిత్ర మాల, రవిక ముక్క, స్వామివారి అన్నప్రసాదాన్ని బహూకరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గోపాలబట్టార్‌, కృష్ణ, కృష్ణరాజ, గోకుల్‌, వరదరాజస్వాములు, టీటీడీ అధికారులు నాగరాజ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement