వాల్మీకిపురం : గత రెండు రోజులుగా క్రీడాకారుల కేరింతలు, ఉత్సాహభరిత వాతావరణం మధ్య సాగిన రాష్ట్రస్థాయి అండర్–14 స్కూల్ గేమ్స్ రగ్బీ టోర్నమెంట్ శనివారం ముగిసింది. వాల్మీకిపురం మండలంలోని కొత్త మంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ ఫైనల్స్ పోరులో బాలుర విభాగంలో కర్నూలు జట్టు, బాలికల విభాగంలో గుంటూరు జట్టు విజేతలుగా నిలిచాయి.
రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుండి తరలివచ్చిన సుమారు 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. శనివారం జరిగిన బాలుర ఫైనల్ మ్యాచ్‌లో కర్నూలు, చిత్తూరు జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కర్నూలు జట్టు అద్భుతమైన వ్యూహాలతో రాణించి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోగా, చిత్తూరు జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే, బాలికల ఫైనల్స్‌లో గుంటూరు జట్టు కృష్ణా జిల్లా జట్టుపై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచింది. కృష్ణా జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు రమేష్‌బాబు, జయకృష్ణలు ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేత జట్లకు మెమెంటోలు, కప్‌లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పీడీ రెడ్డివరప్రసాద్ మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు సాగిన ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించామని చెప్పారు. వీరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి, త్వరలో జరగబోయే జాతీయ స్థాయి (నేషనల్స్) రగ్బీ పోటీలకు పంపనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అబ్జర్వర్ రమేష్‌బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


