కలకడ : మండలంలోని కె.బాటవారిపల్లె వద్ద శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో చిన్నారి సమంత (4) తీవ్రంగా గాయపడింది. వివరాలు.. కె.బాటవారిపల్లెకు చెందిన మద్దిపట్ల.ప్రతాప్‌నాయుడు కుమార్తె సమంత తోటి పిల్లలతో కలిసి రోడ్డువద్ద ఉండగా కలకడ వైపు నుంచి పీలేరు వెళుతున్న బొలెరో పికప్ వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సమంతను 108లో చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు.
మదనపల్లె టూటౌన్ పీఎస్ పక్కన గొడవ
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలోని, మదనపల్లె రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న ఓ ఎంటర్ ప్రైజెస్‌లో శుక్రవారం రాత్రి గొడవ చోటు చేసుకుంది. వ్యాపార లావాదేవీల విషయంలో తలెత్తిన ఈ గొడవ, మనస్పర్థలతో విజయవాడకు చెందిన కిషోర్ కొందరు ఆకతాయిలను తీసుకొచ్చి గొడవకు దిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు రంగప్రవేశం చేసి అల్లరి మూకను చెదర గొట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చీనీ కాయల వ్యాపారిపై కేసు నమోదు
సంజామల: నొస్సం గ్రామానికి చెందిన నలుగురి రైతులను మోసం చేసిన ఓ చినీ కాయల వ్యాపారిపై కేసు నమోదైంది. ఎస్‌ఐ రమణయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మహేంద్ర, గాధంశెట్టి రాఘవ, గాధంశెట్టి లక్ష్మీనారాయణ, ఓబులేసుకు చీని తోటలు ఉన్నాయి. వీరి వద్ద నుంచి రూ.2.18 లక్షలు విలువగల చీనికాయలను వైఎస్సార్ కడప జిల్లా తొండూరు మండలం మల్లాల గ్రామానికి చెందిన భూచిపాటి రామాంజనేయులు జూలై 19వ తేదీన కొనుగోలు చేశాడు. అయితే డబ్బులు కొద్దిరోజులు తర్వాత ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. గడువు ముగిసినా తర్వాత రైతులు డబ్బులు అడుగుతున్నా పట్టించుకోకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు వ్యాపారి రామాంజనేయులపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
కమలాపురం: పట్టణంలోని జడ్పీ బాయ్స్ హైస్కూల్‌కు చెందిన పలువురు విద్యార్థులు ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీ సుబ్బన్న తెలిపారు. అండర్–17 ఫుట్ బాల్ విభాగంలో ఎ.సుశాంత్, అండర్–14 హాకీ విభాగంలో పి. పవన్‌కుమార్, ఎం.వెంకట రాముడు లు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 11వ తేదీ నుంచి రాజమండ్రిలో జరిగే పోటీలకు వారు హాజరవుతారని పీడీ సుబ్బన్న తెలిపారు. ఈ నెల 3వ తేదీన కడప స్పోర్ట్స్ స్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు వారు అర్హత సాధించారు. అలాగే కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్స్ విభాగంలో ఎల్. మహ్మద్ రఫీ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 16 నుంచి మార్కాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అతడు జిల్లా జట్టు తరపున ఆడనున్నాడు. అలాగే సబ్ జూనియర్స్ విభాగంలో ఎల్. ఉమర్ బాషా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. నూజివీడులో ఈ నెల 10 నుంచి జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు అతను హాజరు కానున్నాడు. కాగా శుక్రవారం విజేతలకు పాఠశాల హెచ్‌ఎం ఖాజా పర్వీన్, పీడీ సుబ్బన్న అభినందించారు.


