పెద్దమండ్యం,: మండల కేంద్రంలోని ఏపీ మోడల్ పాఠశాలలో ఈ నెల 3న జరిగిన పేరెంట్స్ కమిటీ ఎన్నికల గందరగోళంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం సమగ్ర విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా కమిటీ ఎన్నిక జరిగిందని, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అక్రమాలకు పాల్పడ్డారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం సమగ్ర శిక్ష ఏపీసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమగ్ర శిక్ష సీఎంఓ కరుణాకర్, ఐఈ కో–ఆర్డినేటర్ జనార్ధనలు పాఠశాలలో విచారణ చేపట్టారు. కమిటీ ఎన్నికల సందర్భంగా ప్రిన్సిపాల్ అనుసరించిన విధానాలపై విచారణాధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవైపు చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి.. వెంటనే కోరం లేదంటూ వాయిదా వేస్తున్నట్లు ఏపీసీ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంపై ప్రిన్సిపాల్‌ను గట్టిగా నిలదీశారు. ఎన్నిక పూర్తయినట్లు రిజిస్టర్‌లో మినిట్స్ రాశారా? అని ప్రశ్నించగా.. కోరం లేకపోవడంతో మినిట్స్ రాయలేదని ప్రిన్సిపాల్ సమాధానం ఇచ్చారు. అయితే పాఠశాల కార్యాలయంలో భద్రంగా ఉండాల్సిన నూతన కమిటీ సభ్యుల వివరాల పత్రాలు ముందే బయటకు ఎలా వచ్చాయని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ప్రమేయంతో ఈ పత్రాలు లీక్ అయ్యాయో తెలపాలని ప్రిన్సిపాల్ నుండి సంజాయిషీ కోరారు. ఎన్నికల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారడంతో, ఓటర్ల (తల్లిదండ్రుల) వివరాలు, వారి నుండి సంతకాలు తీసుకున్న జాబితాతో పాటు ఎన్నికకు సంబంధించిన పలు కీలక రికార్డులను విచారణాధికారులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి ఎన్నిక రోజు వారి భాగస్వామ్యంపై ఆరా తీశారు. అధికారుల విచారణ విషయం తెలుసుకున్న పలువురు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఎన్నిక జరిగిన తీరును అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం స్థానిక ఎమ్మార్సీ భవనంలో ఎంఈఓ–1 మనోహరతో అధికారులు మాట్లాడారు. ఈ గందరగోళంపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని విలేకరులకు తెలిపారు. విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
పత్రాలు సీజ్ చేసిన అధికారులు
ఉపాధ్యాయులతో సమీక్ష


