● పలు రాష్ట్రాల నుంచి హాజరైన భక్తులు
● దర్గా అంతటా పూల కళ
దర్గా ఆవరణలో భక్తుల సందడి
విద్యుద్దీప వెలుగులో పెద్దదర్గా ప్రవేశ ద్వారం
కడప సెవెన్‌రోడ్స్ : దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా పేరు గాంచిన కడప పీరుల్లామాలిక్ దర్గా మరోమారు తన విశిష్ఠతను చాటుకుంది. దర్గా గురువులు హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ సజీవ సమాధి అయిన సందర్భంగా ఏటా ఈ ఉరుసును వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ మారు కూడా ఉరుసును రెట్టించిన ఉత్సాహంతో నిర్వహించారు. శుక్రవారం ఈ సందర్భంగా దర్గా అంతటా విద్యుద్దీపాలు అలంకరించారు. ముఖ్యంగా దర్గాలోని గురువుల మజార్ ప్రాంతాన్ని పూర్తిగా రంగురంగుల పూలతో అలంకరించారు. దర్గా ప్రాంగణమంతా పూల పరిమళం నిండి భక్తులను మైమరిపించింది. ఈ సందర్భంగా ఉద యం దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గంధం సమర్పించి ప్రార్థనలు చేసి పవిత్ర జలాన్ని భక్తులకు అందజేశారు. రాత్రి ప్రధాన గురువుల మజార్ వద్ద మరోమారు గంధం సమర్పణ చేసి ప్రార్థనలు చేశారు.
– మొహర్రం మాసాన్ని పురస్కరించుకుని దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన పీర్లను శుక్రవారం ఊరేగింపుగా తీసుకెళ్లి నీళ్లతో శుభ్రపరిచి పెట్టెల్లో భద్రపరిచారు. అంతకుముందు దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఫాతెహా నిర్వహించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.


