పీలేరు రూరల్ : కుటుంబ సభ్యులంతా ముచ్చట్లలో మునిగిపోయారు.. నవ్వుల్లో తేలియాడుతున్నారు. వారి సంతోషాలను మోసుకెళ్తున్న ఆటోను ఓ రాకాసి కారు మృత్యువై వచ్చి ఢీకొంది. అంతే ముచ్చట్లు మూగబోయాయి.. నవ్వులు బోసిపోయాయి. క్షణాల్లో వారి ఆనందం ఆవిరైంది. ఆటోను కారు ఢీకొన్న విషాధ సంఘటన పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణావడ్డిపల్లె మిట్ట మలుపు వద్ద చిత్తూరు – కడప జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరు మండలం రేగళ్లుకు చెందిన బాబాఫకృద్డీన్ భార్య కె.ఇర్ఫానీ(45) స్వగ్రామమైన కలికిరి మండలం దూదేకులపల్లెలో ఏటా మొహర్రం (పీర్ల) పండుగ ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో గురువారం దూదేకులపల్లెకు వెళ్లడానికి అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ ముబారక్ (55) ఆటోను బాడుగకు తీసుకుని ఇర్ఫానీ తోపాటు అత్త అయిన కె.మెహరూన్‌బీ(70), కుమారులు మొహమ్మద్ వాహిద్ (16), కె.మొహమ్మద్ నౌహిద్(18), బాబా ఫకృధ్ధీన్ సోదరి హుస్సేన్‌బీ కుమారులు అఫ్జల్ (14), ఆసీఫ్ (16) వెళ్లారు. గురువారం అర్ధరాత్రి వరకు పండుగ జరుపుకొని శుక్రవారం తెల్లవారుజామున 12.30 గంటల సమయంలో స్వగ్రామం రేగళ్లు వెళ్లడానికి ఆటోలో బయలుదేరారు. వీరితోపాటు దూదేకులపల్లెకు చెందిన సోహైబ్ (16), సోహన్(18) అదే ఆటోలో పీలేరుకు రావడానికి బయలుదేరారు. అయితే కడప జిల్లా కమలాపురానికి చెందిన కారు డ్రైవర్ వెంకటరమణ, భార్య ప్రశాంతి, కుమార్తె కుసుమప్రియ, మరో మహిళ సుబ్బలక్ష్మీ తిరుమల నుంచి కారులో సొంతూరికి బయలుదేరారు. చిత్తూరు – కడప జాతీయ రహదారిలో ఠాణావడ్డిపల్లె మిట్ట మలుపువద్ద కారు వేగంగా వెళ్లి ఆటోను ఢీకొంది. ఆటో డ్రైవర్ ముబారక్ (55), మెహరూన్‌బీ (70) అక్కడికక్కడే మృతి చెందారు. వాహిద్ (16)ను మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మిగిలిన ఆరుగురితోపాటు కారు డ్రైవర్ వెంకటరమణ తీవ్రంగా గాయపడడంతో.. చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను తిరుపతికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. రేగళ్లుకు చెందిన బాబాఫకృద్దీన్, ఆయన చిన్న కుమారుడు కరీముల్లా మినహా అందరూ మొహర్రం పండుగకు ఆటోలో వెళ్లారు. ప్రమాదంలో ఆయన తల్లి మెహరూన్‌బీ, కుమారుడు మొహమ్మద్ వాహిద్ మృతి చెందగా, భార్య ఇర్ఫానీ, మరో కుమారుడు నౌహిద్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో బాబాఫకృద్ధీన్‌ను ఓదార్చడం ఎవరితరం కాలేదు. బాబాఫకృద్ధీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
పీలేరు రూరల్ : ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పీలేరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అశోక్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, సతీష్, మోహన్‌రెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కె.మెహరూన్‌బీ
మొహర్రం వేళ విషాదం
ఠాణావడ్డిపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
అతి వేగమే ప్రమాదానికి కారణం


