పులిచెర్ల(కల్లూరు) : కల్లూరు ఘాట్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం మామిడి కాయల లోడ్‌తో వెళుతున్న ట్రాక్టరు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రోడ్డుకు అడ్డంగా పడిన ఈ ట్రాక్టరులోని కాయలు రోడ్డంతా పడిపోయాయి. యర్రావారిపాళెం మండలం నెరబైలు నుంచి మామిడి కాయల లోడుతో దామల్ చెరువు మండీకి వెళుతున్న ట్రాక్టరు టైరు పంచరు కావడం, కొక్కీ ఊడి పోయి ట్రాలీ బోల్తా పడడంతో ఈ సంఘటన జరిగింది. అయితే ఎవరికీ గాయాలు కూడా లేదు.
ఉత్సవ విగ్రహం చోరీ
చౌడేపల్లె : మండలంలోని 29ఏ చింతమాకులపల్లె పంచాయతీ బయ్యపల్లెలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి పంచలోహ ఉత్సవమూర్తి విగ్రహం చోరీకి గురైంది. శుక్రవారం ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన భక్తులు గుర్తించి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. విగ్రహంతోపాటు దీప జ్యోతులు సైతం చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమా రు రూ.2 లక్షలు ఉంటుందని గ్రామస్తులు చెప్పా రు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యం
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్): అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో ఒకే రోజు ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఇద్దరికీ 16 ఏళ్ల వయసు కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలికల తల్లిదండ్రులు గురువారం రాత్రి వేర్వేరుగా నిమ్మనపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : భార్య విడాకుల కోసం కోర్టులో కేసు వేసిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం మదనపల్లి మండలంలో చోటు చేసుకున్న ఘటనపై బాధితుడి కుటుంబీకులు, జిల్లా ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బసినికొండ పంచాయితీ గంగన్నగారిపల్లెకు చెందిన శివకుమార్(35) భవన కార్మికుడిగా పని చేస్తూ భార్య ఐశ్వర్య, పిల్లల్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్త తనకు వద్దని అలిగి పుట్టినింటికి వెళ్లిపోయింది. అనంతరం ఓ అడ్వకేట్ సాయంతో స్థానిక కోర్టులో భర్త తనకు వద్దని కోరుతూ.. విడాకులకు దాఖలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న శివకుమార్ తీవ్ర మనస్తాపం చెంది జీవితంపై విరక్తి చెందాడు. ఇతను ఉంటున్న ఇంటిలో తాడుతో ఉరి వేసుకోవడంతో, పిల్లల గమనించి కేకలు పెట్టగా స్థానికులు వచ్చి బాధితుడిని ఉరి నుంచి తప్పించి స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు మెరుగైన వైద్యం అందించి, అక్కడి నుంచి తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని
వృద్ధుడి మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ దగ్గర మురళి హాలుకు వెళ్లే దారిలో గుర్తుతెలియని వృద్ధుడు(60) ఈనెల 22వ తేదీన మృతి చెందాడు. అతని ఆచూకీ తెలియకపోవడంతో కడప రిమ్స్ మార్చురీలో ఉంచారు. తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని కడప వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.


