రైలు జోలికొస్తే జైలు! | - | Sakshi
Sakshi News home page

రైలు జోలికొస్తే జైలు!

Jun 26 2026 4:17 AM | Updated on Jun 26 2026 4:17 AM

రాజంపేట : రైల్వే ప్రయాణికుల భద్రతకు రోజురోజుకూ ముప్పు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో కొందరు ఆకతాయులు, అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు రైల్వే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. రైళ్లపై రాళ్లు వేయడం, సిగ్నలింగ్‌ వ్యవస్థలను అడ్డగోలుగా ధ్వంసం చేయడం, చైన్‌ లాగి రైళ్లను ఆపి ప్రయాణికులను దోచుకోవడం వంటి నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొందరు ఆకతాయులు రైలు ఇంజన్లను లక్ష్యంగా చేసుకుని రాళ్లతో దాడి చేస్తుండటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

అత్యంత సున్నితమైన వ్యవస్థ..

ప్రమాదాలకు ఆస్కారం

రైళ్ల సురక్షిత రాకపోకలను నియంత్రించే సిగ్నలింగ్‌ వ్యవస్ధ అత్యంత సాంకేతికమైనది, చాలా సున్నితమైంది. అయితే, లాభాపేక్షతో దోపిడీలకు పాల్పడే దుండగులు, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే ఆకతాయులు ఈ వ్యవస్థను ధ్వంసం చేయడం లేదా టాంపరింగ్‌ (అక్రమ మార్పులు) చేయడం లాంటి చర్యలకు తెగబడుతున్నారు. దీనివల్ల ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడం లేదా సిగ్నల్స్‌ తప్పుగా చూపించడం జరిగి ఘోర రైలు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని రైల్వే సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుండగులు చేసే ఇటువంటి పనులు వందలాది మంది అమాయక ప్రయాణికుల ప్రాణాలను నేరుగా పణంగా పెట్టడమేనని రైల్వే అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం గుంటూరు జిల్లా పరిధిలో ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఏకంగా రైల్వే సిగ్నల్స్‌ వ్యవస్థను టాంపరింగ్‌ చేసి, రైలు ఆగిన వెంటనే ప్రయాణికులపై పడి వారి వద్ద ఉన్న విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లిన ఘోర ఉదంతం ఇందుకు నిదర్శనం.

అనవసరంగా చైన్‌ లాగితే.. ఏడేళ్ల దాకా జైలు

రైలు ప్రయాణంలో అత్యవసర సమయాల్లో వాడటం కోసం ప్రతి బోగీలోనూ అలారం చైన్‌లను ఏర్పాటు చేస్తారు. అయితే, ప్రయాణికులు ఎలాంటి కారణం లేకుండా అనవసరంగా చైన్‌లాగితే అది చట్టప్రకారం తీవ్రమైన నేరం. దొంగతనాలకు పాల్పడటం కోసమో, ఆకతాయితనంతోనో చైన్‌ లాగి రైళ్లను అర్ధంతరంగా ఆపితే ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైల్వే నిబంధనలను అతిక్రమిస్తే ‘రైల్వే చట్టం 1989’ లోని సెక్షన్లు 141, 151, 153, 174(ఎ) తో పాటు, ‘1966 చట్టం’ లోని సెక్షన్‌ 3 ప్రకారం భారీ జరిమానాతో పాటు గరిష్టంగా ఏడేళ్ల వరకు కఠిన జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

వందేభారత్‌పై రాళ్ల దాడి..

లోకో పైలట్‌కు గాయాలు

మరోవైపు ప్రతిష్టాత్మక వందేభారత్‌ రైలుపై కొద్దిరోజుల కిందట దుండగులు రాళ్లు రువ్వడంతో రైలు కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఆ గాజు ముక్కలు గుచ్చుకుని లోపల కూర్చున్న ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో మరికొంతమంది ఆకతాయులు వేగంగా వెళ్తున్న రైలింజన్‌పై రాయి విసరడంతో విండ్‌ షీల్డ్‌ పగిలి లోపల ఉన్న లోకో పైలట్‌ (డ్రైవర్‌) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణాలపై రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ మరియు రైల్వే అధికారులు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించినా రైల్వే చట్టాల ప్రకారం కఠినమైన జైలుశిక్షలు తప్పవని అధికారులు ఘాటుగా హెచ్చరిస్తున్నారు.

ట్రాక్‌లపై ‘టాంపరింగ్‌’.. రైళ్లపై ‘రాళ్ల’ దాడి చేస్తే ఏడేళ్ల కఠిన శిక్ష

ఘోర రైలు ప్రమాదాలకు ఆకతాయుల కుట్ర

వందేభారత్‌ అద్దాలు ధ్వంసం..

లోకో పైలట్‌, ప్రయాణికులకు

తీవ్ర గాయాలు

అనవసరంగా చైన్‌ లాగితే చట్టప్రకారం జైలు శిక్ష

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement