● రెండు వర్గాల మధ్య ఘర్షణ
● గాయపడ్డ రాజేష్, శరత్
రాయచోటి : ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు దాడులు, ప్రతిదాడులకు దారి తీశాయి. గురువారం సాయంత్రం రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆవరణలో తెలుగు తమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న సంఘటన యుద్ధ వాతావరణాన్ని తలపించింది. టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జ్ మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, చెన్నముక్కపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చవ్వాకుల రాజేష్ వర్గీయుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో చవ్వాకుల రాజేష్, అతని సోదరుడు శరత్‌కు రక్తగాయాలయ్యాయి. రాయచోటి మండలం దిగువ అబ్బవరం రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 15లోని ప్రభుత్వ భూమి విషయమై ఇరువర్గాల మధ్య గత కొన్ని రోజులుగా వైరం నడుస్తోంది. సర్వే నంబర్ 15లో ఉన్న 2.74 ఎకరాల భూమి మురికినాటి సుబ్బారెడ్డి భార్య సుగుణమ్మ పేరున డీకేటీ పట్టా ఉందని సమాచారం. ఇదే భూమిపై చవ్వాకుల రాజేష్, దిగువ అబ్బవరం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు స్వాధీనం చేసుకునే క్రమంలో ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించాయి. భూ తగాదా విషయం జేసీ కోర్టులో ఉన్నట్లు సమాచారం. తన భార్య పేరున ఉన్న భూమిపై అధికారులకు ఫిర్యాదు చేయడం, కోర్టుకు వెళ్లడం ఎంత వరకు సమంజసం అంటూ గురువారం సాయంత్రం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎదురుపడిన చవ్వాకుల రాజేష్‌ను సుబ్బారెడ్డి నిలదీశారు. ఈ విషయంలో మాటకుమాట పెరిగి ఇరువురు ఘర్షణపడ్డారు. ఘర్షణలో గాయాలపాలైన రాజేష్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాజేష్ సోదరుడు శరత్, పార్టీ మండల అధ్యక్షులు గండికోట సుధాకర్, అబ్బవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఇంతలో రాజేష్ సోదరుడు శరత్ మురికినాటి సుబ్బారెడ్డికి ఫోన్ చేసి దమ్ముంటే ఆసుపత్రిలోకి వచ్చి వెళ్లాలని సవాల్ విసరడంతో సుబ్బారెడ్డి అనుచరులు ఒక్కసారిగా ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి ఆవరణంలో తమ్ముళ్ల తగాదాతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకుంటూ దాడులకు దిగారు. రాళ్ల దాడిలో శరత్ తలపై బలమైన గాయమైంది.
భూ ఆక్రమణ కోసం పోటీ
ఇప్పటికే రాయచోటి పరిసర ప్రాంతాలలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను తెలుగు తమ్ముళ్లు ఆక్రమించుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. దిగువ అబ్బవరం గ్రామ పరిధిలోని 13/2 సర్వే నెంబర్‌లో ఉన్న 50 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ విషయంలో కూడా ఇరువర్గాల మధ్య రాజకీయ వార్ నడిచింది. ఈ రెండు సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమి విలువ కోట్ల రూపాయలు పలుకుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ భూమిని రెవెన్యూ అధికారులతో కలిసి గుట్టుచప్పుడు కాకుండా డీకేటీ పట్టాలను పొందడంతోపాటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించిన రెవెన్యూ అధికారులను పక్కన పెట్టి, సబ్ రిజిస్టర్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారన్న ఆరోపణలు వినిపించాయి. అంతేకాకుండా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 50 సెంట్ల ఆక్రమణ విషయంలో సుబ్బారెడ్డి తమకు వ్యతిరేకంగా పనిచేశాడన్న సమాచారం మేరకు 15 సర్వే నంబర్‌లోని సుబ్బారెడ్డి భూమిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు నకిలీ పత్రాలతో భూమిని ఆక్రమించారని చవ్వాకుల రాజేష్ అతని అనుచరులు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఏది ఏమైనా రాయచోటిలో భూ ఆక్రమణలు, తహసీల్దార్, పోలీస్‌స్టేషన్లలో జరుగుతున్న పంచాయతీలలో తెలుగు తమ్ముళ్ల మధ్య కొనసాగుతున్న వార్ ఎప్పుడు ఏ రూపంలో విరుచుకుపడుతుందోనన్న భయం స్థానికుల్లో నెలకొంది.


