కడప కార్పొరేషన్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోనే కాపులకు న్యాయం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సింగసాని గురుమోహన్ అన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానన్న పవన్.. బలిజలపై దాడులు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. జనసేనకు వచ్చిన ఏకై క రాజ్యసభ సీటును కూడా కమ్మ కులానికి ఇచ్చారన్నారు. జనసేన పార్టీ తరఫున కడప జిల్లాలో రెండు డైరెక్టర్ పోస్టులు తప్ప, ఒక్క చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదన్నారు. కాపులకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక గౌరవం ఇచ్చారని, రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ, గురు ప్రసాద్‌కు చైర్మన్, మాచునూరు చంద్రకు మున్సిపల్ చైర్మన్, క్రిష్ణ చైతన్యకు గండి ఆలయ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఏ పార్టీ కాపులకు ఎక్కువ విలువ ఇస్తుందో కాపు కులస్తులు ఆలోచించాలన్నారు. టీడీపీలో హరిప్రసాద్‌కు జాతీయ పదవి ఇచ్చి లోకేష్ పర్యటనలో కింద కూర్చోపెట్టి అవమానించారని పేర్కొన్నారు. కాపులకు టీడీపీ, జనసేన పార్టీల్లో విలువ లేదన్నారు. ఎవరి హయాంలో కాపులకు మేలు జరిగిందో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గాదె సాయిక్రిష్ణను పవన్ క్రిమినల్ అన్నాడని, క్రిమినల్ అయితే చంపే హక్కు ఎవరిచ్చారని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ కాపు నేతలు తోటక్రిష్ణ, మల్లికార్జున కిరణ్, రామక్రిష్ణ, సింధు, సాయిదత్త పాల్గొన్నారు.


