జిల్లాలో 51 స్పోర్ట్స్‌ సమ్మర్‌ క్యాంప్‌లు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 51 స్పోర్ట్స్‌ సమ్మర్‌ క్యాంప్‌లు

May 17 2026 1:30 AM | Updated on May 17 2026 1:30 AM

పీలేరు రూరల్‌: జిల్లా వ్యాప్తంగా 1,800 మంది క్రీడాకారులతో 51 వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అధికారి జి. చంద్రశేఖర్‌ తెలిపారు. శనివారం పీలేరులోని బ్యాడ్మింటన్‌ క్యాంప్‌ను పరిశీలించిన ఆయన, శ్రీ భువన విద్యాలయం వద్ద వాలీబాల్‌, కోటపల్లెలో క్రికెట్‌ క్యాంప్‌లు కూడా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కిలో టమాట రూ.35

సాక్షి, మదనపల్లె: మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టమాట ధరలు దూసుకుపోతున్నాయి. పది రోజులుగా మెల్లగా పుంజుకుంటున్న టమాట ధరలు శనివారం ఒక్కసారిగా పెరిగాయి. కిలో అత్యధిక ధర రూ.35 పలికింది. రెండో గ్రేడ్‌ కిలో రూ.28 పలికింది. విక్రయానికి 410 టన్నుల టమాట వచ్చింది. పెరుగుతున్న ధరలను పరిశీలిస్తే 14వ తేదీ కిలో రూ.29, 15వ తేదీ కిలో రూ.30 పలికింది. శనివారం ఏకంగా రూ.ఐదు పెరిగి రూ.35 పలికింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతకాలం ధరలు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలేక పెట్టిన పెట్టుబడి దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలుకుతున్న ధరలతో రైతులు ఊరట చెందుతున్నారు.

జలధార పనులు

పూర్తి చేయాలి

– డ్వామా పీడీ వెంకటరత్నం

తంబళ్లపల్లె: జలధార పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశించారు. శనివారం మండలంలోని కన్నెమడుగు, పరసతోపు, తంబళ్లపల్లె పంచాయతీల్లో సప్లై ఛానల్‌ పనులను పరిశీలించారు. పనుల నాణ్యతలో వేగవంతంగా పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలన్నారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. ఎంపీడీఓ ప్రసాద్‌,ఏపీవో ఆంజనప్ప, పీఆఱ్‌ ఏఈ వెంకటరమణ, డిప్యూటీ ఎంపిడిఓలు మారుతీకుమార్‌, ఈసీ మహేష్‌ పాల్గొన్నారు.

రుణాల పంపిణీకి

బ్యాంకర్లు సహకరించాలి

తంబళ్లపల్లె: పథకాల లక్ష్య సాధనలకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు చొరవ చూపాలని లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ఆంజనేయులు అన్నారు. ఽశనివారం స్థానిక వెలుగు కార్యాలయంలో బ్యాంకు అధికారులు, వెలుగు సీసీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో 2026–27 వార్షిక రుణ ప్రణాళికలపై చర్చించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారు ఇన్సూరెన్సు బీమా తప్పనిసరిగా చేసుకునే విధంగా బ్యాంకు అధికారులు కృషి చేయాలన్నారు. వెలుగు ఏపీఎం రమేష్‌, ఏవో రమణకుమార్‌, ఏపీఎం గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

రెగ్యులర్‌ ట్రైన్‌గా నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌

మదనపల్లె సిటీ: నాందేడ్‌–ధర్మవరం మధ్య నడుస్తున్న స్పెషల్‌ ట్రైన్‌ను రెగ్యులర్‌ వీక్లీ ట్రైన్‌గా కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 17635/17636 నంబర్లతో నడిచే ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి విజయవాడ, నెల్లూరు,తిరుపతి పాకాల జంక్షన్‌, మదనపల్లె రోడ్డు మీదుగా ప్రయాణించి శనివారం సాయంత్రం 4.30 గంటలకు ధర్మవరం జంక్షన్‌కు చేరుకుంటుంది. స్పెషల్‌ ట్రైన్‌ను రెగ్యులర్‌ ట్రైన్‌గా మార్చడంతో మదనపల్లె ప్రాంత ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement