● రైళ్ల రద్దీకి బ్రేక్.. ‘ఫోర్‌లైన్’కు
ట్రాక్ క్లియర్!
● పట్టాలెక్కుతున్న 20 ఏళ్ల కల!
వేగంగా భూసేకరణ!
● పనులు పూర్తయితే
పెరగనున్న రైళ్ల రాకపోకలు
రాజంపేట: బంగాళాఖాతం–అరేబియా మహాసముద్రాలను అనుసంధానించే దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబై–చైన్నె రైలు మార్గంలో కీలకమైన రేణిగుంట–గుంతకల్లు సెక్షన్‌కు ఎట్టకేలకు మహర్దశ పట్టింది. ఈ మార్గంలో కొత్తగా మూడు, నాలుగు రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా తొలిదశ స్థల సేకరణకు రైల్వే అధికారులు ప్రత్యేక ప్రాజెక్టును ప్రకటించి, చర్యలు వేగవంతం చేశారు. ఈ లైన్లు అందుబాటులోకి వస్తే ఉమ్మడి వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల మీదుగా సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
️ 7.5 °Ñ$Úë-ÌS-Mø OÆð‡Ë$..
ప్రస్తుతం ఈ 310 కిలోమీటర్ల పొడవైన మార్గంలో కేవలం రెండు లైన్లు (డబ్లింగ్) మాత్రమే ఉన్నాయి. వీటిపై రోజుకు ఏకంగా 190 రైళ్లు నడుస్తుండటంతో, ప్రతి 7.5 నిమిషాలకే ఒక రైలు ప్రయాణించాల్సి వస్తోంది. రైల్వే భద్రతా ప్రమాణాల ప్రకారం రెండు రైళ్ల మధ్య కనీసం 15 నిమిషాల వ్యవధి ఉండాలి. కానీ, ప్రస్తుత రద్దీ వల్ల ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను చిన్న చిన్న స్టేషన్ల లో, ఔటర్లలో గంటల తరబడి నిలిపివేస్తున్నారు. ఈ కొత్త లైన్ల నిర్మాణంతో దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
వేగవంతంగా భూసేకరణ: ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రైల్వే చట్టం 1989 సెక్షన్ 2 (37ఎ) కింద భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధిలో అవసరమైన భూములను సేకరించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.
పెరగనున్న రైళ్లు.. ఈ రెండు అదనపు లైన్ల నిర్మాణం పూర్తయితే ముంబై–చైన్నె మధ్య సరుకు రవాణాకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి రవాణా అయ్యే సున్నపురాయి, సిమెంట్, ఇనుప ఖనిజం, ఉక్కు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా వేగవంతం కానుంది. ఇది రైల్వే శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా, ఆధ్యాత్మిక నగరం తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాలకు వైఎస్సార్ కడప జిల్లా మీదుగా మరిన్ని కొత్త రైళ్లు నడవడానికి దోహదపడుతుంది.


