కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యమా అని పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి. బంకుకు వెళ్లి ఇంధనం కొట్టించాలంటేనే గుండె గుభేల్‌మనేలా ‘చమురు’ వదిలిస్తున్నారు మన పాలకులు. ఈ నయా బాదుడును తట్టుకోలేక మదనపల్లె మార్కెట్ యార్డు వద్ద సీపీఎం శ్రేణులు వినూత్నంగా తలపట్టుకున్నాయి. ఆటోలో పెట్రోల్ పోయించే స్తోమత లేక, దానికి తాడు కట్టి రోడ్డుపై లాగుతూ ప్రభుత్వాల వైఫల్యాలను రోడ్డుకెక్కించారు. ఒకరు ‘అచ్చే దిన్’ అంటూ, మరొకరు ‘కూటమి’ స్వర్గం చూపిస్తామంటూ సామాన్యుడి జేబులకు రంధ్రాలు చేస్తున్న తీరుపై జనం ఈసడించుకుంటున్నారు. ఇప్పటికై నా ఇంధన ధరల ఇస్రో రాకెట్లను కిందికి దించకపోతే, భవిష్యత్తులో వాహనాలన్నింటికీ తాడు కట్టి లాక్కోవాల్సిందేనని బాధితులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు! ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు, నాగరాజు, రామకృష్ణ, శ్రీరాములు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. – సాక్షి, మదనపల్లె.


