పెద్దమండ్యం: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగుచేసిన పంటలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ శనివారం పరిశీలించారు. మండలంలోని ముసలికుంట, రామానాయక్‌తండా గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బీడు భూములలో అర్ధ చంద్రాకారం వేయడం ద్వారా భూమిని దుక్కులు చేయకుండా పంటలు సాగుచేసే విధానాల గురించి రైతులకు వివరించారు. ఒక అడుగు గుంతలో సజ్జ, మట్టిక, అలసంద, అనప, మధ్యలో కంది లేదా ఆముదం సాగు చేయవచ్చని తెలిపారు. రుతుపవనాలు రాకముందే పీఎండీఎస్ ( ప్రీమాన్ సూన్ డ్రై సోయింగ్) పంటవేసే విధానం గురించి ఆయన రైతులకు వివరించారు. ఈ విధానం ద్వారా 18 నుంచి 30 రకాల విత్తనాలను వేయవచ్చని వివరించారు. అనంతరం శిద్దవరం రైతు సేవాకేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఏవో సురేష్‌బాబు, ప్రకృతి వ్యవసాయసిబ్బంది శివయ్య, రామయ్య, రవీంద్ర, ఇమ్రాన్ పాల్గొన్నారు.


